రేవంత్ రెడ్డికి షాక్: ‘సమైక్యం’ అంటే కేసీఆర్‌కే తన మద్దతంటూ జగ్గారెడ్డి, పేర్ని నానికి వ్యాఖ్యలపైనా
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి సమైక్యవాదం వినిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇవి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు జగ్గారెడ్డి మద్దతుగా నిలిచారు.

సమైక్యం వైపే నేను.. రేవంత్ డామినేట్ చేయలేరు: జగ్గారెడ్డి
శనివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలోనూ తాను సమైక్య వాదాన్నే వినిపించినట్లు తెలిపారు. అందరూ తెలంగాణ ద్రోహి అన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. సమైక్యం.. నా వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తన అభిప్రాయాలను డామినేట్ చేయలేరని వ్యాఖ్యానించారు. ఆంధ్ర, తెలంగాణ నాయకులు మళ్లీ సమైక్యాన్ని తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అభిప్రాయం వేరు. తన వ్యక్తిగత అభిప్రాయం వేరు అని అన్నారు.

తాను అన్నట్లునే ఇప్పుడు అంటూ జగ్గారెడ్డి..
ప్రజల ఆలోచన మేరకే వెళ్తానని, ఏ ప్రాంతానికి తాను వ్యతిరేకం కాదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇది ప్రజల డిమాండ్ కాదు.. నేతల అభిప్రాయం మాత్రమేనని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే మెరుగైన జీవితం ఉంటుందని భావించి కొట్లాడారని జగ్గారెడ్డి తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామన్నారు. కానీ, ప్రజల ఆంకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. గతంలో తాను అన్నట్లుగానే ఇప్పుడు ఒక్కొక్కరు సమైక్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ వేరు వేరు కాదని అన్నారు.

సమైక్యం వైపే ఉంటానంటూ జగ్గారెడ్డి
రాష్ట్ర విభజన జరిగినా.. ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కోటి మందికిపైగా తెలంగాణలోనే ఉన్నారని జగ్గారెడ్డి చెప్పారు. ఆరోజు తనను తప్పుబట్టినవారు.. ఇప్పుడు సమైక్యానికి మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ఆంధ్రాలో పార్టీ పెట్టమని కోరుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారని.. పార్టీ పెట్టడం ఎందుకు రాష్ట్రాన్ని కలిపేద్దాం అని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రతిపాదించారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. సమైక్యం విషయంలో ఎవరి అభిప్రాయాలను తాను తప్పుపట్టనని, ఎవరి అభిప్రాయాలు వారివని జగ్గారెడ్డి అన్నారు. తాను మాత్రం సమైక్యం వైపే ఉంటానన్నారు. అయితే, కేసీఆర్ వ్యాఖ్యాలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

రెండు రాష్ట్రాలు కలుపుతామంటే కేసీఆర్‌కు మద్దతిస్తా: జగ్గారెడ్డి
రెండు ప్రాంతాలు కలిసి ఉండాలని చెప్పా. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన తరువాత కూడా నా వాయిస్ వినిపించా. గతంలో నేను చెప్పిన విషయాన్నే ఇప్పుడు అందరూ అంటున్నారు. రెండు రాష్ట్రాలు కలుపుతా అంటే కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతిస్తా అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాగా, సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి మాత్రం మళ్లీ సమైక్య రాష్ట్రం కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వేలాది మంది ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను ఏపీలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. కేసీఆర్ మరోసారి ఉమ్మడి రాష్ట్ర కుట్రలకు తెరతీశారంటూ దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications