రేవంత్ టాప్ ప్రయారిటీ అదే: తప్పులు జరగకుండా స్పెషల్‌గా ఐఎఎస్ అధికారి అపాయింట్
Revanth Reddy: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరిపాలనపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోన్నారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తోన్నారు. మెరికల్లాంటి బ్యురోక్రాట్లను కీలక స్థానాల్లో నియమిస్తోన్నారు.
శాంతి భద్రతలు, ప్రజా సమస్యల పరిష్కారం, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల కల్పన, ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించిన ఆరు ఉచిత గ్యారంటీల అమలు.. వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న తప్పులను సరిదిద్దుతున్నారు.

ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో పాలనను వారి వద్దకే తీసుకెళ్తోన్నారు. ఈ క్రమంలో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారం రోజులు మంగళ, శుక్రవారాల్లో హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రజా భవన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
ఒక్కో రోజు ఒక్కో శాఖకు చెందిన మంత్రులు ప్రజావాణిలో పాల్గొంటారు. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. ఈ మంగళవారం కూడా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కొనసాగుతుంది. ధరణి పోర్టల్, పింఛన్లు, డబుల్ బెడ్ రూం.. వంటి అంశాలు ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి అందుతున్నాయి.
ఒక్కో ప్రజావాణిలో వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. వాటన్నింటినీ శాఖలవారీగా విభజించి, ఏ శాఖకు చెందిన ఫిర్యాదులు, విజ్ఞప్తులను ఆ శాఖకు పంపుతున్నారు అధికారులు. వాటిని పరిష్కరించడానికి ఆయా మంత్రులు, ఆ శాఖకు సంబంధించిన అధికారులు ప్రాధాన్యత ఇస్తారు.
ఈ ఫిర్యాదులు, విజ్ఞప్తులు సత్వరంగా పరిష్కరించడానికి రేవంత్ రెడ్డి.. ప్రత్యేకంగా ఓ ఐఎఎస్ అధికారిని నియమించారు. దాసరి హరిచందనను నోడల్ అధికారిగా అపాయింట్ చేశారు. ఆయుష్ డైరెక్టర్‌గా ఉన్న దాసరి హరిచందనను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు బదిలీ చేసింది ప్రభుత్వం. అదే సమయంలో ప్రజావాణి నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలను అప్పగించింది.












Click it and Unblock the Notifications