తెలంగాణాకు వర్ష హెచ్చరిక చేసిన రుతుపవనాలు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు!
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణం ఎంతో వైవిధ్యమైన పరిస్థితులను చూపిస్తోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు మరియు రేపు (జూన్ 13, 14) ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ఈ జిల్లాలలో భారీ వర్షాలు
నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, రంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల్ వంటి జిల్లాల్లో ఇప్పటికే మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో నల్గొండ జిల్లాలోని పులిచెర్లలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. అలాగే ముల్కచర్లలో 9.5 సెం.మీ, నాంపల్లిలో 8.2 సెం.మీ, మాటూరులో 7.9 సెం.మీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కూడా 7.9 సెం.మీ వర్షపాతం నమోదైంది.

నేడు ఈ జిల్లాలలో వర్షాలు
నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో నేడు అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని చందానగర్, మియాపూర్, జేఎన్టీయూ, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, బోరబండ, నారాయణగూడ వంటి ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వాన పడి రహదారులపై వరద నీరు నిలిచిపోయి ట్రాఫిక్ ఎక్కువ సమయం నిలిచిపోయింది.
రుతుపవనాల ప్రభావంతో రాబోయే రెండు రోజులు వర్షాలు
వర్షాల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు వరద నీటిని తొలగించే పనులు చేపట్టాయి.గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు క్రమంగా తగ్గుతాయని అధికారులు అంచనా వేశారు. అయితే రుతుపవనాల ప్రభావం కారణంగా రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఒకవైపు వర్షాలు కురుస్తుండగా మరోవైపు ఎండల తీవ్రత
16 జిల్లాల్లోని సుమారు 63 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలో 42.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42.7 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ వేడి గాలులు ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. రుతుపవనాల వల్ల వాతావరణం చల్లబడుతుందని ఆశించినవారికి ఈ మార్పులు ఆశాభంగాన్ని కలిగిస్తున్నాయి.













Click it and Unblock the Notifications