IMD alert: తెలంగాణలో మరో ఐదు రోజులపాటు 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా.. వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. తెలంగాణలో రాబోయే ఐదు రోజుల వాతావరణ నవీకరణలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం నుంచి రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు.
తెలంగాణలోని 8 జిల్లాలకు అతి భారీ వర్షాల అలర్ట్
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో ఒకచోట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నిర్మల్‌లో అత్యధిక వర్షపాతం: ఈ జిల్లాల్లో ఈదురుగాలులు
అంతేగాక, గురువారం మధ్యాహ్నం నుంచి ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
రుతుపవనాలు ప్రవేశించిన నాటి నుంచి తెలంగాణలో 135.1 మిల్లీమీటర్ల వర్షపాతంతో అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలలో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. నిజామాబాద్‌లో 128.2, జగిత్యాలలో 126.6, పెద్దపల్లిలో 112.7, కరీంనగర్‌లో 100.1 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు ప్రకటించారు.
నిండుకుండల్లా ఉత్తర తెలంగాణ నీటి ప్రాజెక్టులు
ఉత్తర తెలంగాణలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఎస్‌ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టు చరిత్రలో జూలై రెండో వారంలో గేట్లు ఎత్తేశారు. కేవలం నాలుగు రోజుల్లోనే 70 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది. అధికారులు 36 గేట్లను ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం 76 టీఎంసీల నీటిమట్టం 1,087.9 అడుగులకు చేరింది. బుధవారం 4.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 4.57 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగింది. రాష్ట్రంలోని కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులు కూడా వరదనీరుతో నిండుకుండలను తలపిస్తున్నాయి. గేట్లు ఎత్తివేసి వచ్చిననీరును వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు.












Click it and Unblock the Notifications