వడగళ్ల వాన బీభత్సం, మరో రెండు రోజులు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. ఒక వైపు వడగాల్పులు కొన సాగుతుంటే.. మరో వైపు వడగళ్ల వానలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల తో రైతులకు నష్టం వాటిల్లింది. ఇటు ఏపీలో వడగాల్పుల పైన విపత్తుల నిర్వహణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇక.. తెలంగాణలో పలు జిల్లాల్లో రానున్న రెండు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా అలర్ట్స్ ఇచ్చింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రం లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడతాయి. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇవాళ ములుగు, భద్రాద్రి, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహాబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు వర్ష సూచన ఉందని అంచనావేసింది. కాగా.. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు వడగళ్ల వాన తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. ముఖ్యంగా తెలంగాణలోని ములుగు, ఏపీలోని నంద్యాల జిల్లాలో కురిసిన వానకు సామాన్య ప్రజలతో పాటు రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.

వర్షాల వేళ తాజా హెచ్చరికలు
ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో భారీగా వడగళ్ల వాన కురిసింది. గాలుల ధాటికి పలు గ్రామాల్లో ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. ప్రజలు భయంభ్రాంతులకు గురయ్యారు. ఏటూరునాగారం - కమలాపూర్ మార్గంలో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. నంద్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన ధాటికి వందల ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలపాలు కావడంతో రైతులు భారీగా నష్టపోయారు. రుద్రవరం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకస్మిక వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేలకూలిన విద్యుత్ తీగలు, స్తంభాలతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని.. వాటిని తాకవద్దని అధికారులు సూచించారు. రాబోయే కొన్ని గంటల్లో మళ్లీ వర్ష సూచన ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.













Click it and Unblock the Notifications