ఇస్రో రాకెట్‌లో నిమజ్జనానికి తరలిన గణనాథుడు- ట్రెండ్ సెట్
పెద్దపల్లి: తెలంగాణలో వినాయకుడి విగ్రహాల నిమజ్జనం కన్నుల పండువగా సాగింది. తొమ్మిది రోజుల పాటు వైభవంగా భక్తులతో పూజలను అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. వేలాది విగ్రహాల నిమజ్జనోత్సవంతో హైదరాబాద్ క్రిక్కిరిసిపోయింది. లక్షలాది మంది భక్తులు గణేషుడికి ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం వైభవంగా సాగింది. అనేక జిల్లాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో వినాయక నిమజ్జనం ఘనంగా ముగిసింది. స్థానిక ఇక్కడి విశ్వబ్రాహ్మణులు నిర్వహించే శోభాయాత్ర మరీ ప్రత్యేకం. ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది.

ప్రతీ ఏటా వివిధ కళారూపాల్లో మండపాలను ఏర్పాటు చేయడం విశ్వబ్రాహ్మణుల ప్రత్యేకత. ఈ ఏడాది కూడా దీనికి తగ్గట్టుగా మండపాలను నెలకొల్పారు. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణులు ఏర్పాటు చేసిన మండపాలు, ఊరేగింపును తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
ఈసారి కూడా వినూత్న రీతిలో ఇస్రో రాకెట్‌లో గణపయ్యను నిమజ్జనానికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రత్యేక గణపతిని చూడటానికి జిల్లాలోని పలు గ్రామాల నుంచి భక్తులు మంథనికి తరలి వచ్చారు. శోభాయాత్రలో పాల్గొన్నారు. ఇస్రో శాటిలైట్‌లో కొలువుదీరిన గణేషుడిని చూసి ఆనందం వ్యక్తం చేశారు.

మూడు దశాబ్దాలుగా వినాయకుడి నిమజ్జనం కోసం విశ్వ బ్రహ్మణ గజానన మండలి ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. సుమారు నెల రోజుల పాటు శ్రమించి వినూత్న రీతిలో వినాయకుడి కోసం వాహనాలు తయారు చేయిస్తుంటుంది. దీంతో ప్రతి ఏడాది నిమజ్జన వేడుకల్లో ఇక్కడి గణపతి ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు ఇక్కడి గణనాథుడు.
గత ఏడాది నిమజ్జన వేడుకల్లో కొబ్బరి కాయలో బొజ్జ గణపయ్యను పెట్టారు. అంతకుముందు ఆది శేషుడిపై, కలశంలో మరోసారి, హెలికాప్టర్ లో ఇంకోసారి ఇలా రకరకాల వాహనాల్లో నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఇక ఇదే కమిటీ ఏర్పాటు చేసిన టైటానిక్ షిప్‌లో నిమజ్జానికి బయలు దేరిన గణపతి గురించి అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రత్యేకంగా చర్చించుకున్నారు.












Click it and Unblock the Notifications