రేవంత్ రెడ్డి ఎలక్షన్ టీం రెడీ - కోమటిరెడ్డికి ఏఐసీసీ షాక్ : టీపీసీసీ - డీసీసీలకు కొత్త కమిటీలు..!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుకన్నది సాధించారు. వచ్చే ఎన్నికలకు తాను కోరుకున్న వారితో జంబో టీంకు ఆమోద ముద్ర వేయించుకున్నారు. టీపీసీసీ కొత్త కమిటీలకు ఏఐసీసీ ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో మునుగోడు బై పోల్ వేళ తనను ఇబ్బంది పెట్టిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏ ప్రాధాన్యత దక్కలేదు. ఏ కమిటీలోనూ స్థానం కల్పించలేదు. మిగిలిన సీనియర్లు - జూనియర్లతో కలిపి పార్టీకి కీలక మైన మూడు కమిటీలను ఏర్పాటు చేసారు. ఇదే సమయంలో 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయం ఏంటనేది కీలకం కానుంది.

టీపీసీసీకి జంబో కార్యవర్గం
కొంత కాలంగా టీపీసీసీ కొత్త కమిటీల పైన ఏఐసీసీ రాష్ట్ర నేతలతో చర్చలు చేస్తోంది. సీనియర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ పదవుల ప్రక్షాళనకు నిర్ణయించారు. టీపీసీసీ నుంచి ప్రతిపాదనలను పరిశీలించిన తరువాత రాహుల్ గాంధీ సూచనల మేరకు..కేకే వేణుగోపాల్ పర్యవేక్షణలో ఈ జాబితాలకు ఆమోద ముద్ర పడింది. కొత్తగా మూడు ప్రధాన కమిటీలను ప్రకటించారు. అందులో భాగంగా 18 మందితో కీలకమైన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి మాణిక్యం ఠాగూర్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. సభ్యులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్ హనుమంత రావు, పొన్నాల లక్షయ్య,ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర్ రాజ నర్సింహ, రేణుకా చౌదరి, బలరాం నాయక్, మధుయాష్కీ, చిన్నారెడ్డి, శ్రీధర్ బాబు, వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్ ఉన్నారు. పార్టీ లో క్రియాశీలకంగా ఉన్న నేతలందరికీ దాదాపుగా ఈ కమిటీలో స్థానం కల్పించారు.
వర్కింగ్ ప్రెసిడెంట్లు - రాష్ట్ర కమిటీ
ఏఐసీసీ ప్రకటించిన మరో రెండు ముఖ్యమైన కమిటీలను ఖరారు చేసింది. అందులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రస్తుతం ఉన్న వారికే ప్రాధాన్యత ఇచ్చింది. తాజా కమిటీలో అజారుద్దీన్ తో పాటుగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ గౌడ్ తో పాటుగా ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కొనసాగిస్తూ ఏఐసీసీ నిర్ణయించింది. ఇక, సీనియర్లు.. ముఖ్య నేతలతో 40 మందితో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించింది. అందులో ప్రస్తుత ఎమ్మెల్యేల తో పాటుగా పలువురు నేతలకు అవకాశం దక్కింది. జిల్లాలు - సామాజిక వర్గాల వారీగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కమటీని నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ ను మూడు విభాగాలు గా విభజించి బాధ్యతలు కేటాయించారు. రేవంత్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి డీసీసీ అధ్యక్షుల మార్పు అంశం పైన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు 26 జిల్లాల అధ్యక్షుల మార్పుకు ఏఐసీపీ ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ జంబో టీంల ద్వారా రేవంత్ రానున్న ఎన్నికల సంగ్రామానికి సిద్దం కానున్నారు.













Click it and Unblock the Notifications