టెస్టులు పెంచండి: తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదలపై హైకోర్టు సూచనలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. బుధవారం కోవిడ్ కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసులు పెరుగుతుండటంతో పరీక్షలు పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అంతేగాక, తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. జూన్ 22కి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, రాష్ట్రంలో మంగళవారం 13,149 నమూనాలను పరీక్షించగా 119 పాజిటివ్ కేసులు నిర్దారణయ్యాయి. సోమవారం ఈ సంఖ్య 65గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 658కి చేరింది.

గత వారం రోజులతో పోల్చితే హైదరాబాద్ నగరంలో కేసులు గణనీయంగా పెరిగాయి. మరోవైపు, దేశ వ్యాప్తంగా చూసుకుంటే, బుధవారం 5వేలకుపైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. 29వేలకుపైగా దేశంలో యాక్టివ్ కేసులున్నాయి.
కాగా, కేరళ, మహారాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో మాస్కులు తప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం. తెలంగాణలో కూడా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు, విమానాశ్రయాల్లోనూ మాస్కులు ధరించాలని ప్రయాణికులకు అధికారులు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications