మహిళకు అసభ్య మెసేజ్‌లు: సీఐపై వేటు పడింది
హైదరాబాద్: ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలవాల్సిన పోలీసు శాఖలో పనిచేస్తూ.. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఉన్నతాధికారి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళకు అసభ్యకరమైన రీతిలో సందేశాలు పంపించాడు. తన కోరికను తీర్చాలంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టాడు. ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు సదరు పోలీసుపై చర్యలు తీసుకున్నారు.
ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. మహిళను వేధింపులకు గురిచేసిన సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ పురెందర్ రెడ్డిపై వేటు పడింది. అతన్ని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ పట్ల సీఐ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విమర్శలు ఉన్నాయి.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహిళకు సీఐ అసభ్య చాటింగ్ చేశారు. అందంగా ఉన్నావు.. చెప్పినచోటికి రావాలంటూ వాట్సాప్‌లో ఆమెకు సందేశం పంపించాడు. దీంతో సదరు మహిళ సైబరాబాద్ సీపీని ఆశ్రయించింది.
సీఐ తనతో చేసిన చాటింగ్ వివరాలను సీపీకి అందించింది. ఈ నేపథ్యంలో సీఐ పురెందర్ రెడ్డిపై చర్యలు తీసుకున్నారు. పురెందర్ స్థానంలో కూకట్‌పల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న శ్రీనివాసులు నియమితులయ్యారు.
బోయిన్ పల్లిలో దారుణం
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో (Bowenpally) దారుణం చోటుచేసుకుంది. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను చంపేశాడో దుర్మార్గుడు. బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న స్వప్న, గణేశ్ భార్యభర్తలు. వారికి 10 నెలల వయస్సు కలిగిన నక్షత్ర అనే కూతురు ఉంది. అయితే భార్య, కుమార్తెను గొంతు నులిమి చంపేసిన గణేశ్.. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
అతడు బేగంపేటలో రైల్వేట్రాక్‌పై విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications