భారత్‌లో కరోనా ఎమర్జెన్సీ వ్యాక్సిన్ ఎప్పుడంటే.. తేల్చేసిన ఎయిమ్స్ చీఫ్.. కీలక వ్యాఖ్యలు
యూకె,యూఎస్,రష్యా వంటి దేశాలు ఇప్పటికే అత్యవసర కరోనా వ్యాక్సినేషన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నూతన సంవత్సరంలో భారత్ కూడా కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో... భారత్‌లోనూ తయారవుతున్న ఈ వ్యాక్సిన్‌కు ఇక్కడ కూడా అనుమతి లభిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆస్ట్రాజెనెకా కాకపోతే ఏ వ్యాక్సిన్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. తాజాగా ఎయిమ్స్ చీఫ్ డా.రణదీప్ గులేరియా ఈ అంశాలపై స్పందించారు.
అమెరికాలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్: తొలికేసు: నో ట్రావెల్ హిస్టరీ: లోకల్‌గా వ్యాప్తి

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై ఎయిమ్స్ చీఫ్...
'ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా' వ్యాక్సిన్‌కు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కీలక పరిణామం అన్నారు డా.రణదీప్ గులేరియా. ఇది భారత్‌తో పాటు మిగతా ప్రపంచ దేశాలకు మంచి వార్త అని పేర్కొన్నారు.ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను సాధారణ ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చునని,ఫైజర్ తరహాలో దీనికి మైనస్ 70 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం లేదని చెప్పారు. సమీప భవిష్యత్తులోనే భారత్‌లోనూ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు.

మరికొద్దిరోజుల్లోనే ఎమర్జెన్సీ వ్యాక్సిన్...
వ్యాక్సిన్ కచ్చితంగా ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న ప్రశ్నకు.. 'ప్రస్తుతం మా వద్ద వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటా ఉంది.ఆస్ట్రాజెనెకాకు సంబంధించి సీరమ్ ఇనిస్టిట్యూట్ డేటా కూడా మావద్ద ఉన్నది. ఒకసారి డేటాను రెగ్యులేటరీ అథారిటీకి పంపిస్తే కొద్దిరోజుల్లోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. వారాలు,నెలలు కాదు.. రోజుల వ్యవధిలోనే వ్యాక్సిన్ అందుబాటులోకొ రావొచ్చు.' అని డా.రణదీప్ గులేరియా తెలిపారు.

జనవరి 1న కమిటీ సమావేశం...
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారుచేస్తున్న కోవీషీల్డ్,అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్,భారత్ బయోటెక్‌లు వ్యాక్సిన్ అనుమతులు కోరుతూ ఇప్పటికే కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో దేనికి ఇప్పటివరకూ అనుమతులు మంజూరు చేయలేదు. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ వీటి నుంచి మరింత డేటాను కోరాయి. అదనపు డేటా కోసం ఫైజర్ గడువు కోరగా భారత్ బయోటెక్,సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పటికే ఆ డేటాను సమర్పించాయి. ప్రస్తుతం సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ వీటిని విశ్లేషిస్తోంది. జనవరి 1న ఈ కమిటీ మరోసారి సమావేశమై భారత్‌లో ఎమర్జెన్సీ వ్యాక్సిన్‌పై చర్చించనుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందా అన్న ఆసక్తి నెలకొంది.