ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు వీపీ గౌతమ్ హెచ్చరిక!
ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా ఆర్ధిక సహాయం అందించి వారి ఇళ్ళ నిర్మాణానికి తెలంగాణా సర్కార్ విశేషంగా కృషి చేస్తుంది. ఈ క్రమంలోనగరంలోని ఇల్లు లేని పేదలకు కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపట్టి వారికి డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. క్యూర్ పరిధిలో ఈ మేరకు దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిశీలించి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు.
ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్‌కు ఎంపికైన లబ్ధిదారులకు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. బ్రోకర్లు లేదా మధ్యవర్తులను నమ్మి ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని స్పష్టంగా సూచించారు. లక్కీ డ్రా ద్వారా ఎంపికైన అభ్యర్థుల్లో ఇప్పటివరకు 6,660 మంది క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని ఆయన తెలిపారు.

మిగిలిన వారి పరిశీలనను కూడా ఈ వారంలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులుగా నిర్ధారించబడిన వారికి ఈ వారంలోనే అధికారిక కేటాయింపు పత్రాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు.ఎంపికైన అభ్యర్థులు తమకు ఇల్లు వస్తుందా లేదా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మధ్యవర్తులను, దళారులను అసలే నమ్మొద్దన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా సాగుతోందని చెప్పారు.
కొందరు బ్రోకర్లు, మధ్యవర్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇల్లు మంజూరు చేయిస్తామని లేదా అధికారులతో మాట్లాడి సహాయం చేస్తామని చెబుతూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని హెచ్చరించారు. గృహాల కేటాయింపు ప్రక్రియలో బ్రోకర్లు లేదా ఏ మధ్యవర్తికీ ఎలాంటి పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఎవరికీ లంచం, కమీషన్ రూపంలో డబ్బులు ఇవ్వవద్దని సూచించారు.
కేటాయింపు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు, అర్హతలు, అధికారిక ప్రక్రియ ఆధారంగానే జరుగుతుందని చెప్పారు.మొదటి విడత మొత్తాన్ని చెల్లించాల్సిన అధికారిక బ్యాంకు ఖాతా వివరాలు, చెల్లించాల్సిన మొత్తం, గడువు వంటి సమాచారం కేటాయింపు పత్రంతోపాటే అధికారికంగా తెలియజేస్తామని పేర్కొన్నారు. కేటాయింపు పత్రంలో పేర్కొన్న అధికారిక ఖాతాకు మాత్రమే డబ్బులు జమ చేయాలని, వ్యక్తిగత ఖాతాలకు లేదా ఇతరులు చెప్పే ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించవద్దని హెచ్చరించారు.
ఎవరైనా ఇల్లు మంజూరు చేయిస్తామని డబ్బులు అడిగినా లేదా అనధికారిక ఖాతాలకు చెల్లించమని కోరినా వెంటనే తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారిక సమాచారం కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్ సందర్శించవచ్చన్నారు. లేదా కాల్ సెంటర్ నంబరు 040-24603572ను సంప్రదించవచ్చని గౌతమ్ తెలిపారు.













Click it and Unblock the Notifications
