27 రోజుల చిన్నారి కిడ్నాప్: 48 గంటల్లో ఛేదించిన పోలీసులు (పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని కారు పార్కింగ్‌లో జరిగిన 27 రోజుల పసికందు కిడ్నాప్ కేసును నార్త్ జోన్ పోలీసులు కేవలం 48 గంటల్లో ఛేదించారు. డిసిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు డిసిపి పివై గిరి కేసు వివరాలు వెల్లడించారు.
సీసీ ఫుటేజీల ద్వారా గోపాలపురం పోలీసులు గంటల్లోనే చిన్నారిని సురక్షితంగా రక్షించారు. ఖమ్మం జిల్లాకు చెందిన టి రమాదేవి భర్త లక్ష్మణ్ ఏడు నెలల క్రితం మృతి చెందాడు. ఆమె అప్పటికే గర్భిణి.
జీవనోపాధికోసం నగరానికి చేరుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో ఉంటోంది. ఈమె కూతురు(4) నగరంలో ఓ హాస్టల్‌లో ఉండి చదువుకుంటోంది. 27 రోజుల క్రితం రమాదేవికి బాబు (నాగచారి) జన్మించాడు.

కిడ్నాప్ కథ సుఖాంతం
ఫంక్షన్ హాళ్లలో పని చేస్తూ రైల్వే స్టేషన్‌లోనే నివసిస్తున్న సురేష్‌తో రమాదేవికి పరిచయం ఏర్పడింది. రూ.ఐదు వేలు ఇస్తాను.. బాబును అమ్మాలని రమాదేవిని సురేష్ కోరాడు. ఆమె నిరాకరించింది. దీంతో సురేష్ మరో వ్యక్తితో కలిసి వచ్చి మరోసారి ప్రాధేయపడ్డాడు. అయినా ఆమె ఒప్పుకోలేదు. 17న రాత్రి రైల్వే స్టేషన్ కారు పార్కింగ్ వద్ద రమాదేవి తన బాబుతో కూర్చుంది. అక్కడికి వచ్చిన సురేష్‌తో బాబును చూస్తూ ఉండాలని, తాను బాత్రూమ్‌కు వెళ్లి వస్తానని తెలిపింది.

కిడ్నాప్ కథ సుఖాంతం
ఇదే ఆదనుగా భావించిన సురేష్... బాబును తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆమె తిరిగి వచ్చేసరికి బాబు లేకపోవడంతో గోపాలపురం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పాతబస్తీ టోలిచౌకి, హకీంపేటకు చెందిన మహమ్మద్ ఆరీఫ్(25) ఫాస్ట్‌పుడ్ సెంటర్ నిర్వాహకుడు.

కిడ్నాప్ కథ సుఖాంతం
ఇతని పెద్ద అక్క నస్రీన్‌కు జమీల్‌తో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. నస్రీన్‌కు పిల్లలు పుట్టరని నిర్ధ్దారణ కావడంతో, ఆమె భర్త రెండో వివాహం చేసుకుంటానని తెలిపాడు. దీంతో ఆరిఫ్.. బాబును కొనుగోలు చేయాలని భావించాడు. రైల్వే స్టేషన్‌లో సురేష్‌ను అశ్రయించాడు.

కిడ్నాప్ కథ సుఖాంతం
రమాదేవిని బాబును విక్రయించేందుకు నిరాకరించడంతో బాబును సురేష్ కిడ్నాప్ చేసి, అరీఫ్‌కు రూ.12వేలకు విక్రయించాడు. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి సురేష్ ఎత్తుకెళ్లి, ఆరీఫ్‌కు ఇచ్చినట్లు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం ఆరీఫ్ జాడ కనుక్కొని బాబు వారి భారీ నుంచి రక్షించారు. ఆరీఫ్‌ను ఆదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సురేష్ పరారీలో ఉన్నాడు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!