నేడే తెలంగాణ రాజకీయ తెరపై..
తెలంగాణ రాజకీయ తెరపై ఓ నూతన పార్టీ రాబోతోంది. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు కొత్త పార్టీని ప్రకటించబోతోన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. తెలంగాణలో బీఆర్ఎస్ తర్వాత ఆ స్థాయిలో ప్రాంతీయ పార్టీ అంటూ పెద్దగా ఏదీ లేకపోవడంతో.. కవిత ఆ లోటును భర్తీ చేస్తారనే అంచనాలు ఉన్నాయి.
ఈ ఉదయం 10 గంటలకు మెదక్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు కవిత. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలోని అధ్యా కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణంలో ఈ సభ ఏర్పాటైంది. దీనికి ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్‌గా నామకరణం చేశారు. భారీ సభా వేదికను సిద్ధం చేశారు. ఈ సభలోనే ఆమె కొత్త పార్టీ పేరును లాంఛనంగా ప్రకటించనున్నారు. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించనున్నారు.

ఇంకో రెండు సంవత్సరాల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతోన్నందున.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టేలా ఈ కార్యాచరణ ప్రణాళిక ఉండబోతోందని తెలుస్తోంది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో రెండు నెలల కిందటే పేరును రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. ఈ పార్టీ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదివరకే ఆమె బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆ పార్టీ ద్వారా అందిన శాసన మండలి సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, సొంత రాజకీయ పథాన్ని ఎంచుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలోనే కవిత తెలంగాణ జాగృతిని స్థాపించిన విషయం తెలిసిందే. దాన్నే ఆమె తన రాజకీయ ప్రస్థానానికి పునాదిగా మార్చుకుంటోన్నారు. మునీరాబాద్ కు బయలుదేరి వెళ్లడానికి ముందు ఈ ఉదయం ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. భర్త, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలను తీసుకున్నారు.
అనంతరం కవిత గన్‌పార్క్‌లో తెలంగాణ అమరులకు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా సభాస్థలికి చేరుకుంటారు. వేదిక ప్రధాన ద్వారం కాళోజీ నారాయణరావు పేరుతో ఉండగా, ఇతర గేట్లకు రాణి రుద్రమదేవి, మారోజు వీరన్న, చాకలి ఐలమ్మ వంటి తెలంగాణ ప్రముఖుల పేర్లు పెట్టారు. భోజనశాలలకు సూరవరం ప్రతాపరెడ్డి, సమ్మక్క సారలమ్మ, షోయబుల్లా ఖాన్ వంటి మహనీయుల పేర్లు ఖరారు చేశారు.












Click it and Unblock the Notifications