అమెరికా కష్టాలు.. పంపించడం వెనుక!: గుంపులుగా వస్తారేం, 12గంటలు ఓకే గదిలో ఉంచారు
హైదరాబాద్: బుధవారం నాడు న్యూయార్క్ నుంచి మరో పదిహేను మంది తెలుగు విద్యార్థులు వెనక్కి వచ్చారు. దాదాపు గత నెల రోజులుగా విద్యార్థులు అమెరికాకు వెళ్తూ తిరిగి వస్తున్నారు. ఈ నేథ్యంలో మరికొందరు విద్యార్థులు తనిఖీ అధికారులను ఒప్పించగలమనే ధీమాతో వెళ్తున్నారు.
తాజాగా తిరిగి వచ్చిన పదిహేను ఇరవై మంది విద్యార్థులు అదే ధీమాతో వెళ్లారు. కానీ వారికి కూడా అమెరికాలో చుక్కెదురయింది. ఈ మధ్య కాలంలో కేవలం ఇద్దరు ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఆటంకాలను అధిగమించి అమెరికాలో అడుగు పెట్టి, నిలువగలుగుతున్నారు.
ఈ నేపథ్యంలో తాము కూడా ఒప్పించగలమని తాజా బృందం భావించింది. తెలుగు విద్యార్థులు అమెరికా నుంచి తిరిగి వస్తూ అవమానాలకు గురవుతున్నా ప్రభుత్వ యంత్రాంగం ఈ అనిశ్చితికి తెరదించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, బుధవారం తిరిగి వచ్చిన విద్యార్థుల పైన ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీల నేపథ్యంలో ప్రశ్నల వర్షం కురిపించారట. అందరినీ ఒకేచోట నిలబెట్టి ఆంగ్లంలో ప్రశ్నల వర్షం కురిపించారు. మీతోటి విద్యార్థులు తిరిగి వస్తున్నా.. ఇంకా మీరు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు.
అందరూ ఒకే తరహా ధృవపత్రాలు చూపిస్తారు.. వీసాలు తీసుకునేందుకు ఎంత డబ్బులు చెల్లిస్తున్నారని, వర్సిటీలో సీటు కొనేందుకు ఎంత ఇస్తున్నరని తదితర ప్రశ్నలు వేసి విద్యార్థులను వేధించారని తెలుస్తోంది.
తాజా బృందంలో ఓ ఇద్దరు అమ్మాయిలతో ఏమీ మాట్లాడకుండానే వెనక్కి పంపారని సమాచారం. మిగతా విద్యార్థులను పన్నెండు గంటల పాటు ఓ గదిలో కూర్చోబెట్టి.. రిటర్న్ టిక్కెట్లు ఖరారయ్యాయని సమాచారం వచ్చాక విచారణ చేపట్టారని తెలుస్తోంది. హేళనగా, జోకులేసుకుంటూ విచారణ జరిపారట. గుంపులుగా వస్తారంటూ వ్యంగ్యం ప్రదర్శించారట.












Click it and Unblock the Notifications