ఇంట్రెస్టింగ్.. నవ్వుతూ పలకరించుకున్న బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడూ తెలంగాణ రాజకీయాలలో ఉప్పు నిప్పులా ఉండే బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత ఇద్దరు ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారు. నిజామాబాద్ లో అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది.దీంతో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనుండగా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కెసిఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను బండి సంజయ్ ఢిల్లీ లిక్కర్ స్కాం లో పదేపదే టార్గెట్ చేశారు. కవిత జైలుకు వెళ్లడం ఖాయమని అనేక సందర్భాలలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో దందా చేసి తెలంగాణ పరువు నిలువునా తీశారని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక ఇదే సమయంలో కెసిఆర్ తనయ కవిత బండి సంజయ్ కు ఘాటుగానే రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇదిలా కొనసాగుతుండగానే వారిద్దరూ తాజాగా ఒకరికొకరు ఎదురు పడటం, నవ్వుతూ పలకరించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
నిజామాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య నూతన గృహప్రవేశానికి బండి సంజయ్, కవిత ఇద్దరు హాజరయ్యారు. ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు . ఈ సందర్భంగా జిల్లా నేతలను బండి సంజయ్ కు ఎమ్మెల్సీ కవిత పరిచయం చేశారు. ఇక ఈ సన్నివేశం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
నిత్యం విమర్శించుకునే నేతలు నవ్వుకుంటూ మాట్లాడుకోవడంతో ఇది నిజామాబాద్ లో టాక్ అఫ్ ది టౌన్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నేతల విమర్శలు రాజకీయపరమైనవే కానీ, వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు ఉండే అవకాశం లేదని పలువురు కార్యకర్తలు వీరిద్దరూ మాట్లాడుకోవడంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications