కొండా సురేఖ మురళి లవ్ స్టోరీ: బుల్లెట్ బండిపై వచ్చి .. ప్రపోజ్ చేసి.. ఆపై!!
ఈరోజు వాలెంటైన్స్ డే.. ప్రేమికులు అందరూ తమ మనసులోని ప్రేమను వ్యక్తంచేసే అపురూపమైన రోజు. ప్రేమికుల దినోత్సవం అనగానే వరంగల్ జిల్లా వాసులకు ముందు గుర్తొచ్చే జంట కొండా సురేఖ కొండా మురళి.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న కొండా దంపతుల లవ్ స్టోరీ వారిద్దరి గురించి తెలిసిన వారంతా కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. సినిమాటిక్ వేలో కొండా సురేఖ, కొండా మురళిల లవ్ స్టోరీ సాగింది.
ఎల్బీ కళాశాలలో మొదలైన వాళ్ళ ప్రేమ పెళ్లిగా మారి ఇప్పటివరకు ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా సాగుతోంది. కొండ సురేఖ అనేక సందర్భాల్లో వాళ్ళ ప్రేమ కథ మీడియాతో పంచుకున్నారు. ఎల్పీ కళాశాలలో కొండా సురేఖ చదువుకునే సమయంలో సురేఖను ప్రేమించిన కొండా మురళి కళాశాలకు ఆమె బస్సులో వెళితే బస్సు వెనకాలే వెళ్లేవాడని సురేఖ చెప్పారు.

బుల్లెట్ బైక్ పై సురేఖను చూడడానికి ఉదయం ఏడు గంటలకే లేచి వెళ్లి సురేఖ ఇంటి చుట్టూ రౌండ్లు కొట్టేవాడట. కొండ సురేఖ మంచి షటిల్ ప్లేయర్.. ఆమె షటిల్ ఆడుతున్న సమయంలో కూడా ప్రతిరోజు ఆమెను చూసి వెళ్లేవాడు. ఒకరోజు బస్టాండ్లో కొండా సురేఖ నిలుచుని ఉన్నప్పుడు బుల్లెట్ పైన వెళ్లి ఆమె ముందు బైక్ ఆపి తన ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ రాసుకోమని చెప్పి వెళ్ళాడు.
మురళి చెప్పిన ఫోన్ నెంబర్ రాసుకున్న సురేఖ.. చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారట. అయితే అప్పుడు కొండా మురళి కాకుండా, వేరొకరు లిఫ్ట్ చేయటంతో ఆమె మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత మరొక సారి ఫోన్ చేస్తే కూడా ఆయన ఫోన్ కలవలేదని చెప్పారు సురేఖ . ఆ తర్వాత ఓ రోజు షటిల్ ఆడుతున్న సమయంలో బుల్లెట్ బండి పై కొండా సురేఖ వద్దకు వెళ్లిన కొండ మురళి ప్రపోజ్ చేశారు.
అది ప్రేమ ప్రపోజల్ కాదట .. ఏకంగా పెళ్లి ప్రపోజల్ . నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్ గా ప్రపోజ్ చేశారట కొండా మురళి. అప్పుడు సురేఖ తన కులం ప్రస్తావన తీసుకురాగా, తన కులం ఏమిటో తెలుసని, పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పారట. తనకు ఎలాగైతే ప్రపోజ్ చేశాడో అలాగే సురేఖ ఇంట్లో వాళ్ళతో కూడా పెళ్లి చేసుకుంటానని కొండ మురళి స్వయంగా వెళ్లి చెప్పారట.

అప్పటికే సురేఖకు ఒక అక్క పెళ్లికి ఉండడంతో ఆమె పెళ్లి జరిగిన తర్వాత, సురేఖ పెళ్లి చేస్తామని సురేఖ తల్లిదండ్రులు కొండా మురళికి చెప్పారు. ఆ తర్వాత అనుకోని పరిస్థితులలో మురళి వాళ్ళ అన్నయ్య చనిపోవడం, ఆయనకు ఒక కొడుకు ఉండడంతో, వాళ్ళ ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా సురేఖను తొందరగానే పెళ్లి చేసుకోవాల్సి రావడం జరిగిందని ఆమె చెప్పారు.
ఈ క్రమంలో అందరూ ఉండగానే సాయంత్రం ఏడు గంటల సమయంలో హీరోలాగా వచ్చి సురేఖను వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి ముందు తీసుకువెళ్లి తిరుపతిలో వివాహం చేసుకున్నాడు కొండ మురళి. ఈ విషయాన్ని చెప్పి అప్పటికి ఇప్పటికి కొండా మురళి హీరోనే అని కొండా సురేఖ చెబుతుంటారు.












Click it and Unblock the Notifications