అసలే ఓటమి.. ఆపై వర్గ విబేధాలు: గులాబీ పార్టీలో ముసలం!!
తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ వచ్చే పార్లమెంటు ఎన్నికలలో సత్తా చాటాలని భావిస్తుంటే పరిస్థితులు అందుకు అనుకూలంగా కనిపించడం లేదు. అసలే ఓటమి బాధలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి పార్టీలో వర్గ విభేదాలు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి.
పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల సమీక్షలు కొనసాగుతున్న క్రమంలో నియోజకవర్గాల వారీగా పార్టీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. తాజాగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

తెలంగాణ భవన్ వేదికగా పట్నం మహేందర్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో రోహిత్ రెడ్డి వర్గీయులు నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరస్పర నినాదాలతో వాతావరణం ఉధృతంగా మారింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతేకాదు పట్నం మహేందర్ రెడ్డి పైలెట్ రోహిత్ రెడ్డి కూడా ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారని సమాచారం.
ఎన్నికల ఓటమికి మీరంటే మీరు కారణమంటూ ఇరువర్గాలు తీవ్ర స్థాయిలో గొడవకు దిగగా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు వారిద్దరికీ సర్ది చెప్పారు. రివ్యూ మీటింగ్ లో బహిరంగంగా గొడవలు పడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని హరీష్ రావు సర్ది చెప్పారు.
ఒక్క చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం లో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోనూ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉండడం ఇప్పుడు గులాబీ అధినేత కేసిఆర్ కు తలనొప్పిగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైనా, పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న వేళ పార్టీలో వర్గ పోరు పార్టీకి తీరని నష్టం చేస్తుందని అధినేత భావిస్తున్నారు. ఇక ఈ గొడవలకు చెక్ పెట్టడానికి గులాబీ బాస్ ఏం చేయనున్నారు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications