గులాబీ నేతల వర్గపోరు: మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి వర్సెస్ తాజా ఎమ్మెల్యే
టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీలో వర్గ విభేదాలు ముదిరి రచ్చకెక్కుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో అసంతృప్తులు పెద్ద అన్ఖ్యలోనే ఉన్నారు. గులాబీ పార్టీలో పదవులను ఆశించి భంగపడిన వారు, పార్టీలో ప్రాధాన్యతను కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారు పార్టీ ని వీడి వెళ్ళటం కోసం సమయం చూస్తున్నారు. గులాబీ అధినేత కేసీఆర్ కు షాక్ ఇవ్వటానికి రెడీ అవుతున్నారు.

ఎమ్మెల్యే హర్షవర్ధన్ పై జూపల్లి కృష్ణారావు తీవ్ర విమర్శలు
తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య అంతర్గత పోరు చిలికి చిలికి గాలివానగా మారింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తాజా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే హర్షవర్ధన్ పై చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గత కొంత కాలంగా టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఆయన ఎప్పుడైనా కారు దిగొచ్చు అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది.

ఎమ్మెల్యే హర్షవర్ధన్ అమ్ముడుపోయాడని మండిపాటు
జిల్లాలో గులాబీ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇందులో భాగంగా తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే హర్షవర్ధన్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అధికార పార్టీకి అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన 18 ఏళ్ళలో 13 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నానని అయినా పార్టీ మారలేదని చెప్పిన జూపల్లి కృష్ణారావు, అప్పుడే పార్టీ మారితే కోట్లు ఇచ్చే వాళ్ళని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో దౌర్భాగ్య పాలన.. అన్యాయాన్ని ప్రశ్నిస్తానన్న జూపల్లి
కానీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ మాత్రం అందరినీ మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. రైతులను హర్షవర్ధన్ మోసం చేశారని, నష్టపరిహారం కొందరు రైతులకు మాత్రమే వచ్చేలా చేశారని ఆరోపణలు గుప్పించారు. కోట్లు తీసుకుని పార్టీ మారాడని హర్షవర్ధన్ పై విమర్శలు గుప్పించారు. ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు కొనసాగుతుందని జూపల్లి కృష్ణ రావు మండిపడ్డారు. తాను మూడు సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్నానని, ఇకపై అన్యాయాలను ప్రశ్నిస్తానని జూపల్లి కృష్ణారావు తేల్చి చెప్పారు.

జూపల్లి వ్యాఖ్యలపై మహబూబ్ నగర్ జిల్లాలో చర్చ
ఇక ఇప్పటికే పార్టీ మార్పుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల మేరకు తాను నిర్ణయం తీసుకుంటానని ఆయన తేల్చి చెప్పారు. ఇక ఇదే సమయంలో అసంతృప్తులను కూడా ఏకతాటి మీదకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటిస్తే, ఆ సమయంలో ఖమ్మం పర్యటనకు వెళ్లిన జూపల్లి కృష్ణారావు వ్యవహారశైలిపై కూడా పార్టీలో జోరుగా చర్చ జరిగింది. ఇక తాజాగా జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహబూబ్ నగర్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయి అన్నది ఆసక్తి కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications