స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చిచ్చు.. రేవంత్ కు చుక్కలే!
స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల డిసిసి అధ్యక్షుల ప్రకటన కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ డిసిసి అధ్యక్షుల ప్రకటనపైన అంతర్గతంగా అసంతృప్తి చోటు చేసుకుంది.
నల్గొండ డీసీసీ అధ్యక్ష నియామకంపై తీవ్ర అభ్యంతరం
ఇప్పటికే పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. దీంతో కాంగ్రెస్ అన్ని జిల్లాలలోనూ పార్టీ నేతలను, కార్యకర్తలను ఏకతాటి మీదకు తీసుకురావడం సాధ్యమవుతుందా అంటే, కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఉదాహరణకు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కైలాష్ నేతను అధిష్టానం నియమించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కైలాష్ ను డిసిసి అధ్యక్షుడిగా నియమించడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

డీసీసీ అధ్యక్షుడిని తొలగించాలని సీఎంకు లేఖ
తన పైన తన కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కైలాష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎంకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. కైలాష్ నేతను అధ్యక్ష పదవి నుంచి తొలగించి వేరే వారికి ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేక ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఏకంగా రేవంత్ రెడ్డిపైనే కోమటిరెడ్డి అనుచరుడి ఆరోపణ
ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడైన గుమ్మల మోహన్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశాను.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడిగా పనిచేశాను. అట్లాంటి నాకు అధ్యక్ష పదవీ రాలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన అనుచరునికే అధ్యక్ష పదవి ఇచ్చాడని గుమ్మల మోహన్ రెడ్డి ఆరోపించారు.
వరంగల్ లో పార్టీ కోసం పని చేసినా ఏ వర్గంలో లేని వారికి నో ఛాన్స్
వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు విషయానికి వస్తే పార్టీ కోసం ఎప్పటినుంచో పనిచేసిన, అందరిని కలుపుకుపోయే నాయకత్వ లక్షణాలు బాగా ఉన్న, స్థానికంగా పట్టు ఉన్న నాయకుడు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విజయంలో కీలకంగా పనిచేసిన వాడు, ఏ వర్గంలోనూ లేని కుందూరు వెంకట్ రెడ్డి వంటి నాయకులకు అవకాశం దక్కలేదు.
వరంగల్ డీసీసీ అధ్యక్షుడిగా సారయ్య వర్గానికి ఛాన్స్
డీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న ఎర్రబెల్లి స్వర్ణ, కొండా సురేఖ వర్గం నుండి మీసాల ప్రకాష్, నవీన్ రాజు వంటి నాయకులు, బసవరాజు సారయ్య వర్గం నుండి మహమ్మద్ ఆయూబ్ తో పాటు మరో బీసీ, ఎస్సీ అభ్యర్థులు పోటీ పడ్డారు.
దొంతి మాధవ రెడ్డి వర్గం నుండి ఆయన అనుచరులు డిసిసి అధ్యక్షుడికి పోటీ పడ్డారు. చివరకు మైనార్టీల నుండి మహమ్మద్ ఆయుబ్ ని నియమించారు.
కొండా సురేఖ సహకారం ఇవ్వటం కష్టమే
కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన సారయ్య వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో కొండా సురేఖ డిసిసి అధ్యక్ష నియామకంపైన తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం.
ఒక్క నల్గొండ, వరంగల్ జిల్లాలలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ముఖ్య నాయకుల అనుచరులు డిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. తాజాగా కాంగ్రెస్ అధిష్టానం డిసిసి అధ్యక్షులను ప్రకటించిన తర్వాత అంతర్గత వర్గ పోరు పీక్స్ లో కొనసాగుతుంది.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చిచ్చు
ఇదే సమయంలో స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా రావడంతో ఈ ఎన్నికలలో ఒకరికొకరు సహకరిస్తారా? అందరూ కలిసికట్టుగా పార్టీ విజయం కోసం క్షేత్రస్థాయిలో పని చేస్తారా అనేది ప్రశ్నార్థకంగానే మారింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సామే అని చెప్పక తప్పదు.












Click it and Unblock the Notifications