సికింద్రాబాద్ నుంచి వారణాశి- అయోధ్య స్పెషల్: ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే
Secunderabad- Ayodhya tourist special train: సికింద్రాబాద్ నుంచి గంగా- రామాయణ పుణ్యక్షేత్ర పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. వారణాశి- అయోధ్య- నైమిశారణ్యం వంటి ప్రఖ్యాత పుణ్య క్షేత్రాలు ఈ ప్యాకేజీలో చేర్చింది.
భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఎనిమిది రాత్రులు/ తొమ్మిది పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. జూన్ 6వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52.

సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర, ఏపీలో విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస స్టేషన్‌లల్లో ఈ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ సౌకర్యం ఉంది. ఒడిశాలో బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్, జైపూర్ కియోంఝర్ రోడ్, భద్రక్, బాలాసోర్ స్టేషన్లల్లో హాల్ట్ అవుతుంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.
ఈ ప్యాకేజీలో వారణాశి- అయోధ్య- నైమిశారణ్యం (లక్నో)- ప్రయాగ్‌రాజ్- శృంగ్‌వీర్‌పూర్ ఉన్నాయి. వారణాశిలో కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయాల్లో పూజల్లో పాల్గొనవచ్చు. అక్కడి కారిడార్ సందర్శనం కూడా ఈ టూర్ ప్యాకేజీలో ఉంది.
అయోధ్యలో చారిత్రాత్మక బాలరాముడి ఆలయం, హనుమాన్ గర్హి ఆలయాలను దర్శించవచ్చు. అక్కడి సరయూ నది హారతిలో పాల్గొనవచ్చు. నైమిశారణ్యంలో చక్ర తీర్థ, హనుమాన్ గర్హి, వ్యాస గద్దీ, ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించే అవకాశం ఉందీ టూర్ ప్యాకేజీ ద్వారా. రామాయణ నేపథ్యం ఉన్న శృంగ్‌వీర్‌పూర్ ధామ్‌తో ఈ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది. అక్కడి నుంచి మళ్లీ సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్.
ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 16,200 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 15,200 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ)లో పెద్దలకు 26,500, పిల్లలకు 25,300 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దలకు 35,000, పిల్లలకు 33,600 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications