దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

రెవెన్యూ లేకుండానే కానిచ్చేశారు: ‘సుందిళ్ల’ నిర్వాసితులకు కుచ్చుటోపి

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీ వద్ద నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. దీంతో అధికార యంత్రాంగం అనుసరించిన లొసుగులన్నీ వెలుగు చూస్తున్నాయి. రైతుల ప్రమేయం లేకుండా తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క రెవెన్యూ అధికారి కూడా లేకుండా నీటిపారుదలశాఖ ఇంజినీరింగ్ అధికారులే తతంగాన్ని నడిపించారని తెలిసింది. అసలు పరిహారమే చెల్లించకుండా రాత్రికి రాత్రే పనులు మొదలెట్టిన వైనంతో తమకు జరిగిన మోసంపై ఆర్డీఓకు సిరిపురం గ్రామస్తులు ఫిర్యాదుచేయడంతో అసలు సంగతి బయటకొచ్చింది.

  గోదావరి నదిపై కాళేశ్వరం నుంచి సుందిళ్ల బ్యారేజీకి పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని తరలింపు కోసం పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం శివారులో 72 గేట్లతో భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. సమీపంలోని సిరిపురం, చల్లపల్లి, బెస్తపల్లి గ్రామాల్లోని సుమారు 50మంది రైతుల వద్ద నుంచి 120 ఎకరాల భూమిని సేకరించారు. తొలి విడతలో 60 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు.

  Irrigation officials cheated farmers @ Sundilla

  కానీ, ఏడాదికి రెండు పంటలు పండే బంగారంలాంటి భూములను వదులుకోబోమని లేదంటూ రైతులు భీష్మించారు. దిగొచ్చిన అప్పటి జిల్లా కలెక్టర్‌ వర్షిణి, మంథని ఎమ్మెల్యే పుట్టమధు నిర్వాసితులతో సమాలోచనలు జరిపి ఎట్టకేలకు రూ.8 లక్షల పరిహారానికి అంగీకరించారు. ఎకరానికి రూ. 40 వేల పంట నష్ట పరిహారం అందించి గ్రామంలోనే రిజిస్ట్రేషన్లు చేశారు. బ్యారేజీ కోసం మరికొంత భూమి అత్యవసరం కావడంతో రెండో విడతలో భాగంగా 25 రైతులకు చెందిన 60 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు.

  కంపెనీకి తప్పుడు నివేదిక ఇలా

  సిరిపురం గ్రామశివారులో సర్వే నెంబర్‌ 36 నుంచి 46, 49 దాకా మొత్తం 60.25 ఎకరాల భూమి సేకరించారు. గత నెల 22వ తేదీన పంచనామా చేసినట్టు కంపెనీకి తప్పుడు నివేదిక ఇచ్చారు. గ్రామసభ జరగకుండా, ఆర్‌ఐగానీ, వీఆర్‌వోగానీ లేకుండా ఇరిగేషన్‌ ఆండ్‌ కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అధికారులే ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా సంతకాలు తీసుకున్నట్టు సమాచారం. బ్యారేజీ పనుల్లో పనిచేస్తున్న కుమ్మరి స్వామిని పిలిపించుకున్న ఈఈ విష్ణుప్రసాద్‌ 'నీకు జీతం పెంచుతున్నాం. ఈ పేపర్‌పై సంతకం పెట్టు' అని సూచించడంతో సంతకం పెట్టేశాడు. ఈ నెల రెండో తేదీన గ్రామపెద్దల ద్వారా తన భూమి కోల్పోయినట్టు తెలుసుకున్న స్వామి బోరుమన్నాడు.

  పంచనామా రికార్డులన్నీ తప్పేనంటున్న రైతులు

  ఏఈ పిలిపించుకుని సంతకం సేకరించినట్టు బాధితురాలు లావణ్య వాపోయారు. తన ప్రమేయం లేకుండా పంచనామా చేసి భూమి లాక్కున్నారని కన్నీరుమున్నీరైంది. రుక్కుల సాయిలు, చెగ్యాం రఘు, దుర్గం ప్రవీణ్‌, కుమ్మరి రమేష్‌ వీరంతా ఇదే తరహా మోసానికే గురయ్యారు. దీనిపై ఈ నెల 3న జిల్లా కలెక్టర్‌, మంథని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఆగస్ట్‌ 22న పంచనామా చేసినట్టు చూపుతున్న రికార్డులన్నీ తప్పేనని గ్రామపెద్దలు తోట రాజేశం, ఇసంపల్లి లింగయ్య, తిరుపతి, ఆకుతోట రవి, ఇసంపల్లి రవి, గోపు పద్మలింగయ్య, ఆకుదారి రాజేశంలు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు.

  పరిహారం ఇవ్వకుండానే పనులు ప్రారంభం

  రెండో దశలో సేకరించిన భూములకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురికి పరిహారమే చెల్లించలేదు. సర్వే నంబర్‌ 42లో ఉన్న భూమికి ఎలాంటి పరిహారం చెల్లించకుండా, కనీస సమాచారం లేకుండా పనులు కొనసాగిస్తున్నట్టు ఇస్సంపల్లి స్వరూప ఆర్డీవోకు గతవారం ఫిర్యాదు చేసింది. ఎకరం భూమికి డబ్బు ఇవ్వకుండానే పైప్‌లైన్‌ పనులు చేపడుతున్నారని గుమ్మల నర్సమ్మ ఆందోళన చెందుతోంది. ప్రాజెక్టు కోసం భూములు అవసరమైనప్పుడు తమతో మర్యాదపూర్వకంగా మాట్లాడాడని, కానీ పరిహారం చెల్లించే క్రమంలో దురుసుగా వ్యవహరిస్తున్నారని నిర్వాసితుడు దాసరి చంద్రమోహన్‌ తెలిపాడు. భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో పెరిగిన ధరలకనుగుణంగా చెల్లిస్తామని ఇప్పుడు మాట తప్పారని నిర్వాసితుడు దాసరి చంద్రమోహన్‌ ఆరోపించాడు.

  జీతం పెంచే పేరుతో మోసం ఇలా

  జీతం పెంచుతామంటే సంతకం చేశానని కుమ్మరి స్వామి వ్యాఖ్యానించాడు. 'పెద్దగా సదువుకోలేదు. ఈడనే పనిజేస్తున్న. జీతం పెంచుతమంటే సంతకం జేసిన. భూములు అప్పగించే సంతకమని నాకు అస్సలు తెల్వదు. తర్వాత మా ఊళ్లో పెద్దమనుషులు జెప్పినంక నాతో సంతకం తీస్కున్న వాళ్లమీద ఫిర్యాదు జేసిన' అని కుమ్మరి స్వామి వాపోయాడు.

  పెద్ద సార్లు మాట్లాడతారని ఇలా బెదిరింపులు

  పంచనామా కాగితాలు అని చెప్పకుండానే కొందరు సార్లు వచ్చి సంతకాలు పెట్టించుకున్నరని మల్లేశ్ తెలిపాడు ఈ కాగితాలను గ్రామంలో సూపెట్టినంక వాళ్లంతా మమ్మల్ని అడిగితే గలాంటి సంతకం చేయలే అని జెప్పినని పేర్కొన్నాడు. మరో బాధితురాలు గుమ్మల మల్లమ్మ మాట్లాడుతూ 'మా ఐదెకరాల భూమిపోయింది. ఎకరం భూమికి పరిహారం రాలేదు. కానీ పొలంలో రిజర్వాయర్‌ పనులు చేస్తున్నారు. ఇదేందయ్యా అంటే పోలీసులతో బెదిరిస్తున్నారు. ఎప్పుడడిగినా పెద్దసార్లు వచ్చి మాట్లాడతారని చెబుతున్నారు' అని బోరుమన్నారు.

  English summary
  Irrigation and Command Control officials cheated Sundilla farmers. With out revenue officials they had took signatures on white papers to hand over their land. This is revealed after Project work starting only. Then farmers are registered complaint to RDO on irrigation officials.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more