ఐటీ రీఓపెన్.. హైదరాబాద్‌లో నేటి నుంచి కార్యకలాపాలు.. ఈ నిబంధనలు తప్పనిసరి..
లాక్ డౌన్ మొదలైన దాదాపు 50 రోజుల తర్వాత తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఎకనమిక్ యాక్టివిటీస్ మొదలవుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం నుంచి అన్ని జోన్లలో ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. అదే సమయంలో ఐటీ సంస్థలు కూడా తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. అయితే ఈ యాక్టివిటీస్‌కు ప్రభుత్వం కొన్ని కచ్చితమైన నిబంధనలను జారీ చేసింది. వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ వివరాలేంటో ఒకసారి పరిశీలిద్దాం..

రెడ్ జోన్లలో 33శాతం సిబ్బందితో..
గ్రీన్ జోన్ల పరిధిలో గ్రామాల నుంచి మండలాల వరకు అన్ని రకాల యాక్టివిటీస్‌కు గతంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. తాజాగా అన్ని జోన్లలోనూ ప్రభుత్వ కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. అయితే రెడ్ జోన్లలో కేవలం 33 శాతం సిబ్బందితో మాత్రమే కార్యకలాపాలు కొనసాగించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. అయితే ఇందులోనూ కొన్నింటికి మినహాయింపునిచ్చింది. వైద్య ఆరోగ్య శాఖలు, పోలీస్, ఎక్సైజ్, సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక, అత్యవసర సేవలు, విపత్తుల నిర్వహణ,కమర్షియల్ టాక్సులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, రక్షణ, భద్రతా సర్వీసులు,జైళ్లు, హోంగార్డులు, అనుబంధ సేవలు, ఎన్‌ఐసీ, కస్టమ్స్,ఎఫ్‌సీఐ, ఎన్‌సీసీ, ఎన్‌వైకే, పంచాయతీరాజ్ వంటి శాఖలు ఎటువంటి ఆంక్షలు లేకుండా పనిచేస్తాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలోని కార్యాలయాలు వంద శాతం ఉద్యోగులతో నడుస్తాయి.

ఐటీ కంపెనీలకు కండిషన్స్ ఇవే..
33 శాతం వర్క్ ఫోర్స్‌తో హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలను తిరిగి ప్రారంభించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌తో ఇండస్ట్రీ బాడీలు ఏఎస్‌సీఎస్‌సీ, హైసియా, నాస్కామ్, ఐటీ కంపెనీల ప్రతినిధులు సమావేశమై దీనిపై చర్చించారు. సమావేశం అనంతరం ఐటీ సంస్థల రీఓపెనింగ్‌పై స్పష్టమైన గైడ్ లైన్స్ జారీ చేశారు. దాని ప్రకారం.. ప్రతీ షిఫ్టులో 33శాతం వర్క్ ఫోర్స్ మించకూడదు. అలాగే ఉదయం 7గంటలకు లాగిన్ అయ్యేవారు సాయంత్రం 3గంటలకు లాగౌట్ కావాలి. ఉదయం 10గంటలకు లాగిన్ అయ్యేవారు సాయంత్రం 6గంటలకు లాగౌట్ కావాలి. ప్రతీ ఐటీ ఎంప్లాయి కంపెనీ ఐడీ కార్డు,ఆఫీస్ అథారిటీ లెటర్‌ను వెంట తెచ్చుకోవాలి. రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించేందుకు వీలైనంత ఉద్యోగులు కంపెనీ బస్సుల్లోనే ప్రయాణించాలి.
Recommended Video

ఈ నిబంధనలు తప్పనిసరి..
ప్రతీ ఐటీ కంపెనీ ఎంట్రీ గేటు వద్ద స్క్రీనింగ్ టెస్టుల ద్వారా ఉద్యోగుల టెంపరేచర్‌ను పరీక్షించాలి. మాస్కులు,భౌతిక దూరం తప్పనిసరి. బ్రేక్ టైమ్‌లో లేదా ఆఫీస్ ముగిశాక ఉద్యోగులంతా ఒక్కచోట గుమిగూడవద్దు. ఉద్యోగులు ఒకవేళ కంపెనీ క్యాబ్‌లో ప్రయాణిస్తే డ్రైవర్‌తో పాటు ఇద్దరికే అనుమతి ఉంటుంది. 55 ఏళ్లు దాటినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీసులకు అనుమతించరు. ఈ పీరియడ్‌లో అన్ని కంపెనీల్లోనూ క్యాంటీన్లు,కెఫేటేరియాలు మూసే ఉంచాలి.












Click it and Unblock the Notifications