చంద్రబాబు తయారు చేసిన నరహంతకుడు నయీం: జగన్
హైదరాబాద్: నరహంతకుడు నయీంను గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ప్రభుత్వం తయారు చేసిందని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ ఆరోపించారు. రాజ్యం తాను రూపొందించుకున్న చట్టం ప్రకారం నడుచుకోలేని స్థితిలో హంతకముఠాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు.
ఆ క్రమంలోనే నియంత పాలన కొనసాగించిన చంద్రబాబు తయారు చేసి, ప్రజల మీదకు వదిలిన నరహంతకుడు నయీం అని అన్నారు. 1998లో మావోయిస్టు పార్టీ (పీపుల్స్ వార్) తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిందని, వరంగల్ డిక్లరేషన్ నేపథ్యంలో ప్రజా, విద్యార్థి, కళాసంస్థలను ఏర్పాటు చేసిందని వివరించారు.

బెల్లి లలిత వంటి గాయకురాలు తెలంగాణకోసం పాటలు పాడి, ప్రజలను కదిలించారని తెలిపారు. ఆ సమయంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న శాసనసభలో నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు తెలంగాణ పదాన్ని సభలో మాట్లాడవద్దని రూలింగ్ ఇచ్చారని గుర్తు చేశారు. నాటి హోంమంత్రి మాధవరెడ్డి ప్రోద్బలంతోనే బెల్లి లలితను నయీం 17 ముక్కలుగా నరికాడని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం కోస్తాంధ్ర పాలకులు నయీంను ఉపయోగించుకున్నారని వివరించారు. బెల్లి లలిత హత్య తర్వాత పౌరహక్కుల నేత పురుషోత్తం, ఆజం అలీ, తెలంగాణ జనసభ నేత కనకాచారి, పలువురు ప్రజాసంఘాల నేతలను రాజ్యం మద్దతుతో నయీం ఘోరంగా హత్య చేశాడని జగన్ ఆరోపించారు. నయీం ముఠాలో ఇంకా ఎందరో హంతకులున్నారని, ఎప్పుడో ఒకసారి వీరంతా ప్రజల చేతిలో శిక్షకు గురవుతారని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications