'ఇక టిఆర్ఎస్ నుండి టిడిపిలోకి వలసలు', కాంగ్రెస్‌లోకి జగ్గారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ కావాలని ప్రజలు కోరుకున్నారని, కానీ ఆ తర్వాత మూర్ఖుడు ముఖ్యమంత్రి అయ్యారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం నాడు అన్నారు.
ఆయన తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏడాది తర్వాత టిఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వలసలు ప్రారంభమవుతాయని, టిడిపి బలపడుతుందని చెప్పారు.
కాంగ్రెస్‌లోకి జగ్గారెడ్డి
మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను గురువారం కలవనున్నారు.

జగ్గారెడ్డి కొద్ది రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం మెదక్ ఉప ఎన్నికల్లో బిజెపి తరఫున లోకసభకు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నారు.
వచ్చేవారం కుటుంబంతో సహా చంద్రబాబు విదేశీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు మొదటి వారంలో కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏటా వారం రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు విదేశాలకు వెళ్తుంటారు.
వ్యక్తిగత పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించే అవకాశముంది. ఆగస్టు 31 తేదీ నుంచి సెప్టెంబరు 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈలోపే ఆస్ట్రేలియాలో పర్యటించవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications