ఎత్తి చూపుతూనే ఉంటా, భయపడేది లేదు: షబ్బీర్, జానా ఫైర్
హైదరాబాద్: తాను తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటానని, బెదిరింపులకు భయపడేది లేదని కాంగ్రెసు నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. తమ పార్టీ నాయకులను బెదిరించి టిఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఆయన శనివారం మీడియా సమావేశంలో ఆరోపించారు.
తాను గాంధీ సిద్ధాంతాలను నమ్మిన కాంగ్రెసు పార్టీలో ఉన్నానని ఆయన చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే తనను చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటానని ఆయన చెప్పారు.
ప్రశ్నించినందుకు కొమరయ్య అనే రైతును జైల్లో పెట్టారని ఆయన అన్నారు. నిన్న సిఎం కెసిఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కెటిఆర్‌లపై మాట్లాడినందుకే తనను చంపుతామంటూ కాల్స్ వచ్చాయని ఆయన అన్నారు. బెదిరింపు కాల్స్‌పై ఫిర్యాదు చేస్తే ఏ ఒక్క పోలీసు కూడా తమనను అడగలేదని విమర్శించారు. దీన్ని బట్టి బెదిరింపు కాల్స్ వెనక ఉందెవరో ప్రజలే అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, కెసిఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత కె. జానా రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కెసిఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన మీడియాతో అన్నారు.
పార్టీనీ పదవులను ఫణంగా పెట్టి కాంగ్రెసు తెలంగాణను తెస్తే కృతజ్ఞతలు తీర్చుకోవాల్సింది పోయి పార్టీనే లేకుండా చేస్తానని అంటున్నారని ఆయన కెసిఆర్‌పై మండిపడ్డారు. ఇందుకేనా టిఆర్ఎస్‌ను ప్రజలు గెలిపించిందని ఆయన అడిగారు.
కెసిఆర్ ప్రభుత్వంపై రాష్ట్రపతికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ ఏం చేస్తుందో ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ప్రభుత్వ బెదిరింపులకు తమ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీకి వచ్చిన కాల్ నిదర్శమని ఆయన అన్నారు. టిఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తూ రాజ్యంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications