రాయలసీమ కూడా తెలంగాణలో కలిసి,కేసీఆర్ సీఎం అయి ఉంటే!: జేసీ
తెలంగాణ రాష్ట్రంలో రాయలసీమ కూడా కలిసి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకునేదని దివాకర్ రెడ్డి అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.
హైదరాబాద్: ముక్కుసూటి వ్యాఖ్యలకు.. వ్యంగ్యాస్త్రాలకు పెట్టింది పేరు అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. మిగతా టీడీపీ నేతలతో పోలిస్తే.. ఆయన వ్యాఖ్యలెప్పుడూ కాస్త భిన్నంగానే ఉంటాయి. తాజాగా ఆయన తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో దర్శనమివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీ, టీడీఎల్పీ కార్యాలయాలను సందర్శించిన ఆయన.. కాంగ్రెస్ నేత జానారెడ్డితో కొద్దిసేపు ముచ్చటించారు. తెలంగాణ ప్రభుత్వంపై పోరాడడంలో ప్రతిపక్షం విఫలమవుతుందంటూ ఈ సందర్బంగా ఆయన జానారెడ్డితో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

దీంతో జానారెడ్డి-దివాకర్ రెడ్డి మధ్య పలు జోకులు పేలినట్టు సమాచారం. సరదాగా సాగిన వీరి సంభాషణలో రాయలసీమ ప్రస్తావన కూడా వచ్చినట్టు సమాచారం.తెలంగాణ రాష్ట్రంలో రాయలసీమ కూడా కలిసి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకునేదని దివాకర్ రెడ్డి అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.
మమ్మల్ని అడవుల పాలుజేశారు:
సీఎల్పీ నేత జానారెడ్డితో సరదా సంభాషణ అనంతరం అటుగా వెళ్తున్న తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ను దివాకర్ రెడ్డి పలకరించారు. తమను అడవుల పాలుజేశారని ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి ఈటెలతో వాపోయారు. కర్నూలు, అనంతపురం జిల్లాలకు తీవ్ర నీటి కొరత ఏర్పడిందని, తద్వారా రెండు జిల్లాలు తీవ్రంగా నష్టపోతున్నాయని దివాకర్ రెడ్డి ఈటెలతో చెప్పారు.
రాయల తెలంగాణ ఏర్పడి, కేసీఆర్ తమ ముఖ్యమంత్రి అయినట్లయితే పరిస్థితి వేరుగా ఉండేదని మమ్మల్ని తెలంగాణలో కలిపి ఉంటే కనీసం నీళ్లు, బువ్వ దొరికేవని ఈటెలతో జేసీ అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన ఈటెల రాజేందర్ రెడ్డి..'మీకు శ్రీశైలం నుంచి నీరు వస్తుంది కదా?' అని అడిగారు.. అందుకు జేసీ స్పందిస్తూ సీఎంల దయపై ఆధారపడిన జిల్లాలు తమవని,'రాయల తెలంగాణ ఏర్పడి, కేసీఆర్ మాకు కూడా ముఖ్యమంత్రి అయినట్లయితే పరిస్థితులు వేరుగా ఉండేవి. మేము తెలంగాణ వాళ్లం కాదా? మాకు నీళ్లివ్వవా? అని గట్టిగా ప్రశ్నించేవాళ్లం'అని జేసీ పేర్కొన్నారు.
రాయలసీమలోని కనీసం రెండు జిల్లాలనైనా తెలంగాణ రాష్ట్రంలో కలుపుకోవాలని నాడు కేసీఆర్ ను కోరామని, కానీ 'మా రెడ్లే దీన్ని అడ్డుకున్నారని' జేసీ వాపోవడం గమనార్హం. ఈటెలతో సంభాషణ అనంతరం తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి ఛాంబర్ కు వెళ్లారు జేసీ. జేసీని చూడగానే చాయ్ తాగమని టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. దీనికి జేసీ తనదైన శైలిలో స్పందిస్తూ 'మమ్మల్ని వెళ్లగొట్టిన తర్వాత మీ తెలంగాణ చాయ్ నాకెందుకు?' అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications