రాజగోపాల్ తో పాటు బీజేపీలో చేరేది వీరే - లైన్ లో మరి కొందరు ముఖ్యులు..!!
తెలంగాణ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. పార్టీలు మైండ్ గేమ్ తీవ్రతరం చేసాయి. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడారు. బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 21వ తేదీన రాజగోపాల్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ లో చేరేందుకు దాదాపుగా ముహూర్తం ఫిక్స్ అయింది. అదే సమయంలో రాజగోపాల్ తో మరి కొంత మంది కాంగ్రెస్ - టీఆర్ఎస్ నుంచి బీజేపీ లోచేరుతారని చెబుతున్నారు. మునుగోడులోనే భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.

తొలి జాబితా సిద్దం
ఈ రోజున బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో చర్చల సమయంలో అమిత్ షా పర్యటన అధికారికంగా ఫైనల్ కానుంది. 21నే అమిత్ షా పర్యటన ఖరారైతే అదే రోజున ఆయన సమక్షంలో కన్నెబోయిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, దాసోజు శ్రవణ్‌తో పాటు మరికొంత మంది కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల స్వయంగా వెల్లడించారు.
అదే విధంగా శుక్రవారం పార్లమెంట్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. మునుగోడు సభకు రావాలని ఆహ్వానించారు. ఆయన సైతం అంగీకరించారు.

మునుగోడు బై పోల్ పై ఫోకస్
ఆ తరువాత కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నియోజకవర్గ అంశాల పైన అమిత్ షా తో భేటీ అయ్యారు. ఢిల్లీలో ఈ పరిణామాలు జరుగుతున్న సమయంలోనే ఇటు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రాజీనామా చేసారు. ఆయన సైతం బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.
ఇక, టీఆర్ఎస్ లో చేరికలు ఉండవని.. బయటకు వచ్చే వారే ఉంటారని ఈటల చెప్పుకొచ్చారు. అటు కేటీఆర్ బైపోల్ పైన స్పందించారు. ఉప ఎన్నికతో ఏం జరిగిపోదని వ్యాఖ్యానించారు. అసలు ముందు ఎన్నిక నోటీఫికేషన్ రావాలని..ఆ తరువాత దాని పైన చర్చిద్దామని చెప్పుకొచ్చారు. అయితే, బీజేపీ ముఖ్య నేతలు మాత్రం టీఆర్ఎస్ - కాంగ్రెస్ నుంచి కీలక నేతలు కొందరు టచ్ లో ఉన్నారని చెబుతున్నారు.

ఉప ఎన్నిక ఫలితం - కొత్త సమీకరణాలు
మునుగోడు బై పోల్ ఫలితం బీజేపీకి అనుకూలంగా వస్తే...ఇక తమ పార్టీలోకి వలసల వరద ఉంటుందని చెప్పుకొస్తున్నారు. కొందరు రిటైర్డ్ సివిల్స్ అధికారులు సైతం బీజేపీతో టచ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. మునుగోడు సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాజగోపాల్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓడినా - గెలిచినా కాంగ్రెస్ పైన ఎటువంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు.
ఇక, ఇదే సరైన సమయంగా భావిస్తున్న బీజేపీ నేతలు అన్ని రకాలుగా రాజకీయ వ్యూహాలను అమలు చేయటం కోసం పావులు కదుపుతున్నారు. దీంతో..ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications