టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. అదును చూసి దెబ్బకొట్టారుగా..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా సెటిలర్ల ఓట్లు కోసం రేవంత్ రెడ్డి ప్రత్యర్థులకు ఊహకందని విధంగా పాచికలు వేస్తున్నారు. దీనిలో భాగంగానే రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..అమీర్‌పేట్‌లో టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్ర సెటిలర్ ఓటర్లను ఆకట్టుకోవడంలో రేవంత్ రెడ్డి ఇక్కడ విజయవంతం అయ్యారు. తాజాగా ఆయన మరో అడుగు ముందుకేసి టీడీపీ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబును అరెస్టు అయితే హైదరాబాద్‌లో పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపే హక్కును అడ్డుకున్న వారికి టీడీపీ మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సమయంలో ఎవరికి అండగా నిలబడాలి, ఎవరికి ఓటేయాలి అనే విషయాన్ని టీడీపీ కార్యకర్తలు నిర్ణయించుకోవాలని ఆయన కోరారు.

అంతేకాకుండా, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన నందమూరి తారక రామారావు ఘాట్‌ను తొలగించాలని యత్నించిన వారికి టీడీపీ కార్యకర్తలు మద్దతు పలకడం ఎంతవరకు న్యాయమని ఆయన సూటిగా ప్రశ్నించారు.
చంద్రబాబుకి కష్టకాలంలో నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వని, అలాగే తెలుగు జాతి గౌరవాన్ని ప్రతిబింబించే ఎన్టీఆర్ ఘాట్‌ను టార్గెట్ చేసిన శక్తుల పట్ల టీడీపీ కార్యకర్తలు తమ వైఖరిని పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు.
తెలంగాణ రాజకీయాల్లో టీడీపీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గతంలో ఉన్న విభేదాలు ఏమైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు ప్రజల ఆత్మగౌరవం, టీడీపీ స్థాపన వెనుక ఉన్న విలువలను గౌరవించే వారికి మాత్రమే మద్దతు ఇవ్వాలనే సందేశాన్ని రేవంత్ రెడ్డి పరోక్షంగా ఇచ్చారు.












Click it and Unblock the Notifications