జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. గత మూడు రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి.. ఇవాళ ఉదయం 5 గంటల 45 నిమిషాల సమయంలో తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయాన్ని మాదాపూర్ లోని ఆయన నివాసానికి తరలించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్, కేటీఆర్, హరీష్ రావు.. తదితరులు ఆయన మృతిపై సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే గోపీనాథ్ మృతికి చంద్రబాబు సంతాపం తెలిపారు. గోపీనాథ్ రాజకీయ ప్రయాణం తెలుగుదేశంతోనే ప్రారంభమైందని తెలిపారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు గోపీనాథ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మరోవైపు మాగంటి నివాసానికి చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్.. గోపీనాథ్ భౌతికకాయాన్ని చూసి ఒక్కసారిగా ఏడ్చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అంతేకాక ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు గోపీనాథ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మాగంటి గోపీనాథ్ మృతిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. అంతేకా మాజీ మంత్రి తలసాని, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి.. తదితర నేతలు సంతాపం తెలిపి నివాళులు అర్పించారు.
అంజలి ఘటించిన సీఎం రేవంత్ రెడ్డి..
మాగంటి గోపీనాథ్ భౌతిక కాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. పూలమాల వేసి అంజలి ఘటించారు. గోపీనాథ్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. అంతేకాక ఆస్పత్రి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనున్నట్లు తెలిపారు. ఇక జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఇవాళ మధ్యాహ్నం 3- 4 గంటల మధ్య మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి.

మాగంటి గోపీనాథ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు.. మాగంటి గోపీనాథ్ పాడే మోశారు. మరికొద్దిసేపట్లో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications