'గాంధీ'లో ఇలానా?: టెక్నీషియన్లకు లైంగిక వేధింపులు.. తేల్చనున్న షీ టీమ్!
స్పందించిన సూపరిండెంట్.. దీనిపై విచారణ జరిపేందుకు ముగ్గురు మహిళా ప్రొఫెసర్లతో కూడిన షీ టీమ్ ను నియమించారు.
హైదరాబాద్: సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ల నుంచి తమకు లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్లు వాపోతున్నారు. వేధింపుల పర్వం ఎక్కువవుతుండటంతో.. ఆసుపత్రి సూపరిండెంట్ ను కలిసి వారు ఫిర్యాదు చేశారు.
మంగళవారం సుమారు 20మంది విద్యార్థినులు సూపరిండెంట్ ను కలిసి తమ సమస్యలను వివరించారు. స్పందించిన సూపరిండెంట్.. దీనిపై విచారణ జరిపేందుకు ముగ్గురు మహిళా ప్రొఫెసర్లతో కూడిన షీ టీమ్ ను నియమించారు. దీనికి సంబంధించి మూడు రోజుల్లో తనకు నివేదిక అందజేయాలని ఆదేశించారు.

నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సూపరిండెంట్ హామి ఇచ్చారు. కాగా, ప్రైవేటు కాలేజీల్లో ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ, బీఎస్‌సి-ఎంఎల్‌టీ తదితర ఒకేషనల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుల విద్యార్థులు టెక్నికల్ ట్రెయినింగ్ నిమిత్తం తప్పనిసరిగా గాంధీ ఆసుపత్రిలో 6నెలల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగా సుమారు 100మందికి పైగా విద్యార్థులు గాంధీ ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది విద్యార్థినులే ఉన్నారు. ఆయా విభాగాల్లో ఉన్న సీనియర్ టెక్నీషియన్స్ వీరిని లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు విద్యార్థినులు సూపరిండెంట్‌కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications