నేడు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్న జూపల్లి కృష్ణారావు తదితరులు!!
తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. నేడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి, వనపర్తి ఎంపీపీ మేఘా రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు శ్రీ వర్ధన్ తదితరులు బుధవారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
దీని కోసం వీరంతా ఇప్పటికే ఢిల్లీ వెళ్ళారు. లోక్ సభ సమావేశాలు జరుగుతున్న క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ కు చెందిన మరో ముఖ్య నేత టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఈ ఇద్దరు నేతలతో కలిసి వెళ్లి నేటి మధ్యాహ్నం 12 గంటలకు జూపల్లి తదితరులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని సమాచారం.

అయితే వీలును బట్టి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ గానీ ఈ చేరిక కార్యక్రమానికి రావచ్చని చెబుతున్నారు. వాస్తవానికి కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి, ప్రియాంక గాంధీని ఆహ్వానించి, బహిరంగ సభ వేదికగా జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరాలని భావించారు. జూపల్లి కృష్ణారావు తో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రావు తనయుడు రాజేష్ రెడ్డి తదితరులు కూడా పార్టీలో చేరాలని భావించారు.
ఇప్పటికే రెండుసార్లు కొల్లాపూర్లో నిర్వహించాలనుకున్న బహిరంగ సభ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు తో పాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి నేరుగా ఢిల్లీకి వెళ్లవలసి వచ్చింది. అయితే కొల్లాపూర్ లో బహిరంగ సభ లేనట్టేనని పలువురు భావిస్తున్నారు. కానీ సభ రద్దు కాలేదని ఈ నెలలో 7వతేదీ నుంచి 14వ తేదీలలో ప్రియాంక గాంధీ కొల్లాపూర్ కి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే పార్టీ కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొనేందుకు ముందుగానే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న మేరకు నేడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి తో పాటు పలువురు ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నేను తెలంగాణ రాష్ట్రంలో కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో కాంగ్రెస్ శ్రేణులలో జోష్ కనిపిస్తుంది. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications