Arunachalam మోక్ష మార్గంలో ఇరుక్కుపోయిన మహిళ, భక్తి పేరుతో ప్రాణాల మీదికి..
భక్తి ఉండటం మంచిదే.. కానీ అది ప్రాణాల మీదికి తెచ్చే మూఢనమ్మకంగా మారకూడదు. ఆధ్యాత్మిక కేంద్రమైన తమిళనాడులోని తిరువణ్ణామలై 'మోక్ష మార్గం' చుట్టూ జరుగుతున్న ప్రచారం ఇప్పుడు భక్తుల ప్రాణాలను బలిగొంటోంది. ఆ సందులోంచి దూరితే మోక్షం లభిస్తుందనే నమ్మకంతో భక్తులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇటీవలే రాజమండ్రికి చెందిన మణికుమార్ (36) అనే యువకుడు ఈ మోక్ష ద్వారంలో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోగా, తాజాగా సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరొక మహిళా భక్తురాలు కూడా అదే తరహాలో ప్రాణాంతక పరిస్థితిని ఎదుర్కొని తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
అసలు ఏంటీ 'మోక్ష ద్వారం'?
అరుణాచల గిరిప్రదక్షిణ మార్గంలో అతి చిన్న ఇరుకైన రాతి సందులు ఉంటాయి. వీటిని స్థానికంగా 'మోక్ష ద్వారం' అని పిలుస్తుంటారు. ఈ చిన్నపాటి రంధ్రంలోంచి బయటకు వస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుందని, పునర్జన్మ ఉండదని ఒక బలమైన ప్రచారం శతాబ్దాలుగా సాగుతోంది. ఈ నమ్మకంతో ప్రతిరోజూ వందలాది మంది భక్తులు ఎంతటి ప్రమాదానికైనా వెనుకాడకుండా ఆ ఇరుకైన సందులోంచి దూరేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తిరువణ్ణామలై వెళ్లి గిరిప్రదక్షిణ చేస్తూ.. మోక్ష మార్గం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు.

రాజమండ్రి వ్యక్తి విషాదాంతం.. తీరని శోకం!
గత నెల 24న రాజమండ్రికి చెందిన మణికుమార్ తన కుటుంబంతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లారు. రాత్రివేళ గిరిప్రదక్షిణ చేస్తూ ఈ మోక్ష ద్వారం వద్దకు చేరుకున్నారు. శరీర బరువును అంచనా వేసుకోకుండా ఆ ఇరుకైన మార్గంలోంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సగం దూరంలో ఆయన శరీరం గట్టిగా ఇరుక్కుపోయింది. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక తీవ్ర శ్వాసకోశ ఇబ్బందికి గురయ్యారు. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు ఎంతో శ్రమించి ఆయనను బయటకు తీసేసరికే ఊపిరి ఆడక అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆసుపత్రికి తరలించేలోపే ఆయన ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
మళ్లీ అదే రిపీట్.. విలవిలలాడిన మహిళా భక్తురాలు!
ఈ ఘటన జరిగి కొద్ది రోజులు కూడా కాకముందే.. తాజాగా ఏపీకి చెందిన మరో మహిళా భక్తురాలు కూడా అదే 'మోక్ష ద్వారం' ఉచ్చులో చిక్కుకుంది. ఆ సందులో ఇరుక్కుపోయిన ఆమె, ఊపిరాడక భయంతో గట్టిగా కేకలు వేసింది. అదృష్టవశాత్తూ అక్కడ ఉన్న తోటి భక్తులు తక్షణమే స్పందించి బయటకు లాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆధ్యాత్మికత వర్సెస్ ప్రాణం!
భగవంతుడు కోరుకునేది స్వచ్ఛమైన భక్తిని మాత్రమే కానీ, ఇలా ప్రాణాలను పణంగా పెట్టే సాహసాలను కాదనే స్పృహ భక్తుల్లో రావాల్సి ఉంది. శరీర పరిమాణాన్ని, ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా ఇరుకైన రాతి మార్గంలో ప్రయోగాలు చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి కొన్ని నిమిషాల్లోనే మరణం సంభవించే ప్రమాదం ఉంది.
ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు అధికారులు, ఆలయ యంత్రాంగం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ మోక్ష ద్వారం వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదా ప్రమాదకరంగా ఉన్న ఆ ఇరుకైన మార్గాన్ని మూసివేయడం వంటి కఠిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని అమాయక ప్రాణాలు బలికాక తప్పవు.












Click it and Unblock the Notifications