తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే నియమితులయ్యారు. జస్టిస్ అలోక్ ఆరాధే ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు జడ్జీగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో 1964, ఏప్రిల్ 13న జన్మించిన జస్టిస్ అలోక్.. 1988 జులై 12న న్యాయవాదిగా చేరారు. 2009 డిసెంబర్ 29న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జమ్మూకాశ్మీర్ న్యాయమూర్తిగా 2016, సెప్టెంబర్ 16న బదిలీ అయిన జస్టిస్ అలోక్ ఆరాధే.. ఆ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమికీ, లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. జస్టిస్ అలోక్ ఆరాధే 2018లో మూడు నెలలపాటు జమ్మూకాశ్మీర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.

కర్ణాటక హైకోర్టు జడ్జీగా 2018 నవంబర్ 17 నుంచి కొనసాగుతున్న జస్టిస్ అలోక్.. కొంతకాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. కొలీజియం సీఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
మరోవైపు, జస్టిస్ సామ్ కొశాయ్ తెలంగాణ హైకోర్టు జడ్జీగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు జడ్జీగా ఉన్నారు. జులై 5న పలువురు జడ్జీల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కొలీజియం సిఫారసు చేసినవారిలో ఐదుగురు జడ్జీల బదిలీకి కేంద్రం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన తర్వాత జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ఇది ఇలావుండగా, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుభాసిస్ తలపత్రా నియమితులయ్యారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సునీతా అగర్వాల్ నియమితులయ్యారు. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆశిష్ జితేంద్ర దేశాయ్ నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications