వాళ్ల పేర్లు చెప్పాలంటూ కవితపై ఈడీ, సీబీఐ ఒత్తిళ్లు
K Kavitha: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఇబ్బందులు మరింత పెరిగాయి. ఒకవంక- బెయిల్ కోసం ఆమె ప్రయత్నాలు సాగిస్తోండగా.. మరోవంక కొత్త ఛార్జిషీట్ దాఖలైంది.
ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు. సీబీఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగాల్సి ఉంది. బెయిల్ కోసం కవిత ప్రయత్నాలు సాగిస్తోన్నప్పటికీ.. అవి విజయవంతం కావట్లేదు. బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం నిరాకరించింది.

తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్న కవితను ఈ ఉదయం బీఆర్ఎస్ నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. సుమారు అరగంట పాటు ములాఖత్ కొనసాగింది. ఆ సమయంలో ఆయన వెంట కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి.
వాటి వివరాలను ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ నుంచి కవిత తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోన్నారని అన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వని నాయకుల పేర్లను వెల్లడించాలంటూ అధికారులు ఆమెను ఒత్తిడి చేస్తోన్నారని చెప్పారు.
తమకు లొంగని రాజకీయ నాయకుల పేర్లను కవిత ద్వారా చెప్పించి వాళ్లపై కేసులు బనాయించాలనుకుంటోన్నారని విమర్శించారు. ఇది- అక్రమం, అనైతికం, రాజ్యంగ విరుద్ధమని ఆరోపించారు ప్రవీణ్ కుమార్. తనపై అక్రమ కేసులు బనాయించారని, ఈ కేసులతో ఎలాంటి ప్రమేయం లేదని కవిత ముందు నుంచీ చెబుతూ వస్తోన్నారని చెప్పారు.

ఒక తల్లిగా బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉందని, తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కవితపై సీబీఐ ఎలా చర్యలు తీసుకోగలుగుతుందని ఆయన నిలదీశారు.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపైనా దర్యాప్తు ఏజెన్సీలు ఇలాంటి కేసులనే బనాయించారని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించినప్పుడు కవితకు ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications