కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోంది: తెలంగాణ సీఎంతో కుమారస్వామి కీలక చర్చలు
హైదరాబాద్: అన్ని రంగాల మేధావులు, ఆర్థికవేత్తలు, నిపుణులతో సుదీర్ఘంగా చర్చించి ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించామని సీఎం కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చారు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి. ప్రగతి భవన్‌కు చేరుకున్న కుమారస్వామికి, సీఎం కేసీఆర్ స్వయంగా ఎదురెళ్లి సాదరంగా స్వాగతం పలికి.. లోనికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

కేసీఆర్‌పై కుమారస్వామి ప్రశంసలు
ప్రగతిభవన్‌లో కుమారస్వామితో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై కుమారస్వామి ప్రశంసలు కురిపించారు. అన్ని వర్గాలను కలుపుకొంటూ ముందుకు సాగి, ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పంథాలో తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అపార అనుభవం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశానికి ఆయన సేవలు ఎంతో అవసరం ఉన్నాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ముందునడుస్తూ, క్రియాశీలక భూమిక పోషించాలని, అందుకు తమ సంపూర్ణ మద్దతుంటుందని కుమారస్వామి తెలిపారు. సీఎం కేసీఆర్, త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలను కుమారస్వామి స్వాగతించారు. వర్తమాన జాతీయ రాజకీయాల్లో, దేశ పాలనలో ప్రత్యామ్న్యాయ శూన్యత నెలకొన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వంటి సీనియర్ లీడర్ ఆవశ్యకత దేశానికి అత్యవసరమని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ఈ భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో కుమారస్వామి సుదీర్ఘంగా చర్చించారు. తమ ఇద్దరి మధ్య అర్థవంతమైన చర్చ సాగిందని కుమారస్వామి తెలిపారు.

దేశానికి తెలంగాణ మోడల్ అవసరమన్న కుమారస్వామి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 8ఏళ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ సాధించిన అభివృద్ధిని దేశమంతా చర్చిస్తోందని, తమకూ ఈ అభివృద్ధి కావాలని కోరుకుంటుందని ఈ సందర్భంగా కుమారస్వామి సీఎం కేసీఆర్‌కు అభింనదనలు తెలిపారు. దేశవ్యాప్తంగా పోల్చి చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, ఉచిత తాగునీరు, సాగునీరు, వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు, తదితర పథకాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో కుమారస్వామి పంచుకున్నారు. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అనతి కాలంలోనే ప్రశంసలు అందుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దేశానికి తెలంగాణ మోడల్ అవసరమున్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

బీజేపీ ముక్త్ భారత్ కోసం రాజకీయ శక్తులన్నీ ఏకమవ్వాలి
దేశంలో, విచ్చిన్నకర పాలన ధోరణులు రోజు రోజుకు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజల నడుమన విభజన సృష్టించే కుట్రలను సమిష్టిగా తిప్పికొట్టాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర, స్వార్థ రాజకీయ పంథాను, దాని పర్యవసానాలను చర్చించిన ఇరువురు నేతలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని మత విద్వేషపు ప్రమాదకర అంచుల్లోకి నెట్టబడకుండా కాపాడుకుంటామని వారిరువురు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ దిశగా దేశ ప్రజాస్వామిక సమాఖ్య స్పూర్తిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరముందని వారు గుర్తించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కుమారస్వామి.. కేసీఆర్‌తో అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి దేశ గుణాత్మక ప్రగతికోసం తన వంతు సహకారాన్ని అందించాలని, అందుకోసం రాజకీయ పార్టీని స్థాపిస్తే తమ సంపూర్ణ మద్దతుంటుందని కుమార స్వామి తెలిపారు.

జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ కేసీఆర్‌పై పెరుగుతున్న ఒత్తిడి
కాగా, బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అనే అభిప్రాయం దేశ ప్రజల్లో సన్నగిల్లిందని.. కాంగ్రెస్ నాయకత్వంపై దేశ ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితులే నేడు కనిపిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తి ఫరిఢవిల్లేలా ప్రాంతీయ పార్టీల ఐక్యత నేటి దేశ రాజకీయ తక్షణావసరమని వారు చర్చించారు.
కాగా, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, తెలంగాణ మాదిరిగానే దేశాన్ని కూడా నడిపించాలని తనపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతున్న విషయాలను సీఎం కేసీఆర్.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి వివరించారు. మతతత్వ బీజేపీపై, మోడీ ప్రజావ్యతిరేక, నిరంకుశ వైఖరిపై పోరాడాలని ప్రజలు హర్షధ్వానాలతో, నినాదాలతో జిల్లాల పర్యటనల సందర్భంగా ప్రతిచోటా బహిరంగసభలో ప్రజలు తమ మద్దతు తెలియజేస్తున్నారని తెలిపారు. ప్రగతిపథంలో నడుస్తున్న తెలంగాణను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తూ అనేకరకాలుగా ఆటంకాలు సృష్టిస్తున్న బీజేపీపై ప్రజలు పూర్తి వ్యతిరేక ధోరణితో ఉన్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా గ్రామస్థాయి నుంచీ, జిల్లా, రాష్ట్ర స్థాయి అధ్యక్ష, కార్యదర్శివర్గాలు కూడా జాతీయ పార్టీని స్థాపించి, బీజేపీని ఇంటికి సాగనంపాలని ముక్తకంఠంతో తీర్మానాలు చేస్తున్నాయని సీఎం కేసీఆర్ వివరించారు. వ్యవసాయాధారిత భారతదేశంలో తెలంగాణలో మాదిరిగానే రైతులకు ఇస్తున్న నిరంతర విద్యుత్ తదితర ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, రైతు రుణాల మాఫీ, సహా వ్యవసాయ అభివృద్ధి పథకాలన్నింటినీ దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చని సీఎం కేసీఆర్ వివరించారు. కాగా,
తెలంగాణలో జరుగుతున్న రైతు సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకున్న దేశవ్యాప్తంగా ఉన్న పలు రైతు సంఘాల నేతలు ఇటీవలే రాష్ట్రాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో పర్యటించారని చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి రైతు రాజ్య స్థాపనకు కృషి చేయాలని వారు డిమాండ్ చేస్తూ, తనతో మూడు రోజులపాటు జరిగిన చర్చల విషయాన్ని సీఎం కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్ కేంద్రంగా దేశ రాజకీయాల్లో చర్చ
త్వరలో సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ ఎజెండాపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. దేశ చరిత్రనే వక్రీకరిస్తూ కొనసాగుతున్న బీజేపీ విధ్వంసకర రాజకీయ ఎత్తుగడలను తుత్తునియలు చేయని పక్షంలో దేశంలో రాజకీయ, పాలనా సంక్షోభం తప్పదనే విషయాన్ని వారు తమ చర్చలో గుర్తించారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సకల వర్గాలను కలుపుకపోతూ భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. మౌలిక సమస్యలను గాలికొదిలి, భావోద్వేగాలతో పబ్బం గడుపుకొనే బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని, అందుకు రాబోయే సార్వత్రిక ఎన్నికలనే వేదికగా మలచుకోవాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు.
దేశ రాజకీయాల్లో 75 సంవత్సరాలపాటుగా సాగుతున్న మూస రాజకీయాలకు దేశ ప్రజలు విసుగెత్తిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయని, వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ గురించి వారిద్దరూ చర్చించారు. అంతర్జాతీయంగా పలు దేశాలలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను, అభివృద్ధి దిశగా ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలను సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రత్యామ్నాయ రాజకీయంగా మాట్లాడుకునే అసలు సిసలు రాజకీయ పంథానే నేడు దేశానికి అత్యవసరమని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. జాతీయ సమస్యలపై స్పందిస్తూ ఢిల్లీ కేంద్రంగా జరిపిన చర్చలతోపాటు, తాను చేపట్టిన పలు రాష్ట్రాల పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట్రాల ప్రజలు పలికిన ఆహ్వానాల తీరుతెన్నులపై వారిద్దరూ చర్చించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికి ముందు సాగిన అభిప్రాయ సేకరణ మాదిరిగానే ఇప్పటికే మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగించి, ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగామని త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దాదాపు మూడు గంటలకు పైగా సాగిన సమావేశంలోని చర్చలు అర్థవంతంగా ముగిసాయి. అనంతరం ప్రగతి భవన్ నుంచి తిరిగి బయలుదేరిన కుమారస్వామికి మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ వీడ్కోలు పలికారు.












Click it and Unblock the Notifications