కర్ణాటక హిజాబ్ వివాదం: "హమ్ సబ్ హిందుస్తానీ" అంటూ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత కర్ణాటక రాష్ట్రంలోని హిజాబ్ వివాదంపై స్పందించారు. మహిళల వస్త్రధారణపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు సృష్టికర్తలని వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని పేర్కొన్న కవిత కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ వివాదానికి నిరసనగా తన చేతితో స్వదస్తూరితో రాసిన "హమ్ సబ్ హిందుస్తానీ" అనే కవితను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేశారు.
కర్ణాటక హిజాబ్ వివాదం నేపధ్యంలో ఆసక్తికర కవిత రాసిన ఎమ్మెల్సీ కవిత
టీఆర్‌ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) సభ్యురాలు, మాజీ ఎంపీ కవిత తాను రాసిన కవితలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విభజన శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మనమంతా ఒక్కటే, భారతీయులం అని ఘాటుగా వ్యాఖ్యానించారు. హిందీలో ఆమె రాసిన కవిత సారాంశం చూస్తే హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు ఏ ధర్మాన్ని ఆచరించే వారైనా మనమంతా భారతీయులమే.. సింధూర తిలకం పెట్టుకున్నా, పగిడి ధరించినా, హిజాబ్ వేసుకున్నా మన వేషధారణ ఎలా ఉన్నా మనమంతా భారతీయులమే .. భారత త్రివర్ణ పతాకాన్ని స్పందించిన పింగళి వెంకయ్య అయినా, జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చిన ఆబీద్ హసన్ సఫ్రానీ అయినా, సారే జహాసే అచ్చా అంటూ గీతాన్ని రచించిన మహమ్మద్ ఇక్బాల్ అయినా, జనగణమన రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఐనా మనందరికీ చెప్పింది ఒక్కటే, మనం ఎవరిమైనా సరే మనమంతా భారతీయులం అంటూ కవిత "హమ్ సబ్ హిందుస్థానీ" అంటూ భిన్నత్వంలో ఏకత్వం మన నినాదం అంటూ తన కవిత ద్వారా వెల్లడించారు.

స్త్రీలు వస్త్రాలు ధరించడంలోవారి సౌకర్యాన్ని నిర్ణయించుకోనివ్వండి
ఇదే సమయంలో సింధూరాన్ని ధరించడం తన ఎంపిక అని, హిజాబ్ ధరించడం ముస్కాన్ యొక్క ఎంపిక అని పేర్కొన్న కవిత స్త్రీలు వస్త్రాలు ధరించడంలో తమకు సౌకర్యంగా ఉన్న విషయాన్ని నిర్ణయించుకోనివ్వండి, ఈ వ్యవహారంలో ఎవరి జోక్యం అవసరం లేదని కవిత ట్వీట్ చేశారు. పోకిరీలకు వ్యతిరేకంగా చేసిన వీడియో వైరల్ అయిన మాండ్యా అమ్మాయిని అభినందిస్తూ, కవిత ఇలా పేర్కొన్నారు. జీవనశైలి మరియు దుస్తుల ఎంపిక వ్యక్తిగత నిర్ణయం అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

చిలికి చిలికి గాలివానగా కర్ణాటక హిజాబ్ వివాదం
సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గం స్త్రీలు, మతాలు ఎలా ప్రవర్తించాలని ఆశిస్తున్నారనే భావనతో భారతదేశాన్ని అంచనా వేయలేమని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. కర్ణాటకలోని కోస్టల్ టౌన్ ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాల యాజమాన్యం హిజాబ్ ధరించినందుకు ఆరుగురు ముస్లిం బాలికలను తరగతులకు హాజరుకాకుండా నిషేధించడంతో జనవరి 1న కర్ణాటక హిజాబ్ గొడవ ప్రారంభమైంది.
Recommended Video

కర్ణాటక హిజాబ్ వివాదం .. విచారిస్తున్న ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్
కళాశాలలో కి హిజాబ్ ను అనుమతించకపోవడంతో విద్యార్థినులు చేపట్టిన ఆందోళన పెను దుమారాన్నే రేపింది. మూడు రోజుల పాటు కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించేదాకా వెళ్లింది పరిస్థితి. ఈ విషయం ఇప్పుడు పెద్ద వివాదంగా మారి రాజకీయ దుమారం రేపుతోంది. కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ వివాదంపై ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఫిబ్రవరి 10, గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ మొదలైంది.












Click it and Unblock the Notifications