ఎక్కే విమానం దిగే విమానం తప్ప తెచ్చిందేంటి రేవంత్ రెడ్డి?
తెలంగాణ రాజకీయాలలో బలమైన ముద్ర వేస్తానని, కొత్త పార్టీతో ప్రజలలోకి వెళతానని ఇప్పటికే ప్రకటన చేసిన కవిత, ఓవైపు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, మరోవైపు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఇక తాజాగా మరోమారు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన కవిత దావోస్ ట్రిప్ దండగ అంటూ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.
దావోస్ ట్రిప్ పేరుమీద సాధించింది ఏదీ లేదు: కవిత
ఇప్పటివరకు రేవంత్ రెడ్డి దావోస్ ట్రిప్ పేరుమీద సాధించింది ఏదీ లేదని కవిత టార్గెట్ చేశారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అంటేనే కోట్లాది పెట్టుబడులు, భారీ పరిశ్రమలు, లక్షల ఉద్యోగాలు అనే ప్రభుత్వ ప్రచారం తప్పా అవి నిజమైంది ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఎక్కే విమానం, దిగే విమానం తప్ప రెండేళ్లుగా తెలంగాణకు నిజంగా దావోస్ పర్యటనల ద్వారా ఏమి దక్కిందని మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

ప్రచారం తప్ప మీరు తెచ్చిందేమీ లేదు
లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం తప్ప రెండేళ్లలో తెలంగాణకు మీరు తెచ్చింది ఏంటి ముఖ్యమంత్రి గారు అంటూ నిలదీశారు. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.40,232 కోట్లు వచ్చినట్టు, 2025లో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో వచ్చినట్టు మీరు, మీ ప్రభుత్వం ప్రచారం చేసుకున్నారని పేర్కొన్నారు. కవిత వీటిలో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు.
ఆ వివరాలతో శ్వేత పత్రం విడుదల చెయ్యాలని డిమాండ్
దావోస్ సమ్మిట్ ల ద్వారా ఎన్ని పరిశ్రమలను పెట్టారో చెప్పాలన్నారు. ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్తూ శ్వేత పత్రం విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా బలంగా నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేస్తున్న కవిత ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించుతున్న టు కొత్త పార్టీ ప్రారంభానికి ముందే వ్యూహాలకు పదును పెడుతున్నట్టు ప్రస్తుతం తెలంగాణాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకపక్క పార్టీ ఏర్పాటుకు వ్యూహాలు రచిస్తూనే మరోవైపు ప్రత్యర్ధి పార్టీలను బలంగా టార్గెట్ చ చేస్తున్నారు కవిత.












Click it and Unblock the Notifications