Kavitha: కవిత నోట 'జై ఆంధ్ర' నినాదం-తిరుపతిలో కీలక వ్యాఖ్యలు..!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో క్లీన్ చిట్ లభించడంతో ఊరట పొందుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ కుమార్తె కవిత (kavitha) ఇవాళ ఏపీలోని తిరుపతికి వచ్చారు. కుటుంబంతో కలిసి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆమె.. అక్కడి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. మధ్యలో ఎయిర్ పోర్టులో మీడియాతో కవిత మాట్లాడారు. లిక్కర్ స్కాం క్లీన్ చిట్ నుంచి కొత్త పార్టీ వరకూ పలు అంశాలపై మాట్లాడారు.
ఇవాళ తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన కవిత తొలిసారి జై ఆంధ్ర నినాదాలు చేశారు. ఏపీలోని తన శ్రేయోభిలాషుల్ని ఉద్దేశించి ఆమె ఈ నినాదాలు చేశారు. నాలుగేళ్ల వేధింపుల తర్వాత దేవుడి దయతో లిక్కర్ కేసు నుండి క్లీన్ చిట్ లభించిందని కవిత పేర్కొన్నారు. స్వామివారిపై తమ కుటుంబానికి అపారమైన నమ్మకం ఉందని, అందుకే మొక్కు తీర్చుకోవడానికి తిరుమల వచ్చినట్లు కవిత తెలిపారు. తన పట్ల ప్రేమ చూపిన ఆంధ్రా శ్రేయోభిలాషులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే త్వరలో స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నట్లు కవిత వెల్లడించారు.

తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రివాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇతరులకు సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో సీబీఐ చేసిన దర్యాప్తును కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. లిక్కర్ స్కాం కేసు కారణంగా కవితతో పాటు వీరంతా గతంలో జైలు పాలయ్యారు. ప్రస్తుతం వీరంతా బెయిల్ పై ఉన్నారు. అయితే కోర్టు తాజా నిర్ణయంతో వీరందరికీ విముక్తి లభించినట్లయింది. ఈ నేపథ్యంలోనే కవిత కొత్త పార్టీ పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు.












Click it and Unblock the Notifications