ఎన్నికల వేళ.. కేసీఆర్ ను డిఫెన్స్ లోకి నెట్టిన డ్రీమ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు జరుగుతున్న పరిణామాలు తెలంగాణ సీఎం కెసిఆర్ కు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. సరిగ్గా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కెసిఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీని కెసిఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం డిఫెన్స్ లోకి నెట్టింది. ఎక్కడికి వెళ్ళినా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఊదరగొట్టే కెసిఆర్ కు, ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ఊహించని షాక్ ఇచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు ఒకటొకటిగా బయట పడుతుంటే ప్రతిపక్షాలకు అది ఆయుధంగా మారింది. తాజాగా మేడిగడ్డ బ్యారేజీ లోని రెండు పిల్లర్లు కుంగి పోవడంతో కెసిఆర్ పైన, బీఆర్ఎస్ పైన మరింత ఒత్తిడి పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతమని, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఆయన మానస పుత్రిక అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు.

ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టు లో జరిగిన అవినీతిపై ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇరిగేషన్ శాఖ కేసీఆర్ అధీనంలో ఉండడంతో రెండు ప్రాజెక్టులలోని లోపాలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ మీద ఉందని, కేసీఆర్ ను ప్రతిపక్ష పార్టీలు నాయకులు టార్గెట్ చేస్తున్నారు.
కమీషన్లకు కక్కుర్తి వల్లే ప్రాజెక్టులను నాసిరకంగా నిర్మించారని విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కెసిఆర్ నోరు విప్పలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు దీనిపై ఏమి మాట్లాడాలో కూడా దిక్కుతోచని స్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి నిర్మించామని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు బయటపడడం తెలంగాణ సీఎం కేసీఆర్ డిఫెన్స్ లోకి నెట్టింది.
ఇక నేడు కేంద్ర జల వనరుల శాఖ ఆదేశాల మేరకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ఈరోజు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను సందర్శిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగటం పై కేంద్ర జల వనరుల శాఖ పంపిన అధికారుల బృందం దీనిపై ఏం నివేదిక ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారగా, ఈ వ్యవహారంలో కేసీఆర్ ఏం చెయ్యబోతున్నారు? ఏం చెప్పబోతున్నారు? అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications