'ఇంట్లో నాలుగో మంత్రి పదవి కోసమే కేసీఆర్', 'ఆ 22 మంది ఎవరు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ కుటుంబంలో నాలుగో మంత్రి పదవి కోసం ఢిల్లీలో దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారా అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య శనివారం మండిపడ్డారు.
బంగారు తెలంగాణ అంటే మీ బంగారు కుటుంబమేనా అని ప్రశ్నించారు. కేసీఆర్ పైన ప్రజలు తిరగబడే రోజులు దూరంలో లేవన్నారు. సెక్షన్8 పైన ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష ఎందుకన్నారు.

మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధానినో, రాష్ట్రపతినో కలిసి సెక్షన్ 8 అమలు చేయవద్దని కోరవచ్చు కదా అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నుండి బయటపడేందుకే తెలంగాణ తన వల్ల వచ్చిందని కేసీఆర్ చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ఇప్పటికే వారు కుటుంబంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని, నాలుగో వ్యక్తికి కేంద్రంలో మంత్రి పదవి కోసమే ఈ రాద్ధాంతం చేస్తున్నారని కల్వకుంట్ల కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నార్నారు.
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ మండిపడ్డారు. 63 మంది ఎమ్మెల్యేలున్న తెరాసకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదనంగా 22 ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆ ఓట్లు వేసిన వారి పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications