ఈ అల్లరి పిల్లగాడు అంతలోనే ఎంత ఎదిగాడు- తనయుడిపై కేటీఆర్ ఎమోషనల్
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వంకుట్ల హిమాన్షు రావు కేరీర్‌లో మరో ముందడుగు పడింది. ఈ మధ్యే ఇంటర్మీడియట్‌ను పూర్తి చేసుకున్న హిమాన్షు.. ఉన్నత చదువుల కోసం శనివారం రాత్రి అమెరికా బయలుదేరి వెళ్లారు. కుటుంబంతో కలిసి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కారు.
గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషన్ స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ను చదువుకున్నారు హిమాన్షు. గ్రాడ్యుయేషన్ డే వేడుకల‌్లో పట్టాను అందుకున్నారు. అప్పట్లో జరిగిన ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత, నాయనమ్మ కేసీఆర్, శోభ దంపతులు, తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ, చెల్లి అలేఖ్య హాజరయ్యారు. కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్‌లోనూ హిమాన్షుకు సీఏఎస్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది.

ఇక తాజాగా- ఉన్నత చదువుల కోసం అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట కేటీఆర్, శైలిమ, చెల్లెలు అలేఖ్య ఉన్నారు. యూఎస్ కాలేజీలో జాయిన్ కావాల్సి ఉంది. దీనికోసం వారం రోజుల పాటు అమెరికాలో గడపనుంది కేటీఆర్ కుటుంబం. అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత స్వదేశానికి తిరిగి వస్తారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఫొటోను హిమాన్షు షేర్ చేశారు. అన్‌టిల్ నెక్స్ట్ టైమ్ హైదరాబాద్ అంటూ కామెంట్ యాడ్ చేశారు. తన తనయుడు అమెరికాకు వెళ్తోన్న సందర్భంగా కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. తన భావాలను వివరిస్తూ ఓ ట్వీట్ చేశారాయన. హిమాన్షు నెలల పసికందుగా ఉన్నప్పటి నుంచీ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునేంత వరకు వేర్వేరు సందర్భాల్లో తీసిన కొన్ని ఫొటోలను ఈ ట్వీట్‌కు జత చేశారు.
నిన్నటి వరకు అల్లరి చేస్తూ చిన్న పిల్లవాడిగా కనిపించిన ఈ కుర్రాడు పెరిగి పెద్దవాడయ్యాడు.. అప్పుడే కాలేజీ చదివే స్థాయికి ఎదిగాడు.. అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. హిమాన్షు ఒక్కడే అమెరికాకు వెళ్లట్లేదని, తన సగభాగాన్ని తీసుకెళ్తున్నాడంటూ ఎమోషన్ అయ్యారు. తండ్రిగా తన విధులను కూడా నిర్వర్తించాల్సి ఉందని, వారం పాటు కుటుంబంతో యూఎస్‌కు బయలుదేరానని చెప్పారు.












Click it and Unblock the Notifications