ఏపీ సింగిల్ రోడ్, తెలంగాణ డబుల్ రోడ్: సత్తుపల్లి సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
ఖమ్మం: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ తెలంగాణలో దళారీ రాజ్యమే వస్తుందని బీఆర సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో.. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో ఆలోచించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
'ధరణి తీసివేస్తమని రాహుల్ గాంధీకి కూడా మాట్లాడుతున్నడు. రాహుల్ గాంధీకి ఎద్దు ఎరుకనా.. ఎవుసరం ఎరుకనా? ఎన్నడన్న నాగలి పట్టిండా? రైతుల బాధలు తెలుసా? ఇక్కడ ఎవడో సన్నాసి రాసిస్తే తెల్వక అజ్ఞానంతో మాట్లాడుతున్నడు. ధరణి బంద్ అయితే.. దానికి ప్రత్యామ్నాయం ఏం వస్తుంది? మళ్లీ వీఆర్వోలేనా ? మళ్లీ పహాణీ నకల్లేనా? మళ్లీ ఎమ్మార్వో కార్యాలయం.. వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుడేనా? అన్న నా పేరు ఎక్కియ్యంటే.. మళ్లీ ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అంటారు. మళ్లీ అదే రావాలా? మీ అధికారం ఉండాలా? మీ అధికారాన్ని తీసివేసుకుంటారా..? అంటూ ప్రశ్నించారు సీఎం కేసీఆర్.

'మళ్లీ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తుంది. పైరవీకారుల చుట్టూ తిప్పే రాజ్యం వస్తుంది. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నడు.. కేసీఆర్ ప్రజలు కట్టే అమూల్యమైన పన్నుల డబ్బులను రైతుబంధు అని రైతులకు పంచి దుబార చేస్తున్నడని మాట్లాడుతున్నడు. రైతుబంధు ఉండాలా వద్దా? మరి దుబారా అనేటాయనను ఏం చేయాలి? దాని అర్థమేంది. కాంగ్రెస్ మీకు హింట్ ఇస్తుంది. గొడ్డలి భుజం మీదున్నది. బట్టకప్పారు గంతే.. ఒక్క దెబ్బతో కాంగ్రెస్ గెలిస్తే.. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జై భీమ్.. కరెంటు కాటకలుస్తుంది. బతుకు అంధకారమవుతుంది' అంటూ కేసీఆర్ హెచ్చరించారు.
'బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చెరువులు నింపుకుంటున్నాం. సండ్ర వెంకటవీరయ్య నాతో పోరాడి.. కాలువలు తవ్వించారు. చెరువు నింపడంతో వెంసూర్ మండలం కూడా పచ్చబడ్డది' అని కేసీఆర్ తెలిపారు. మరోవై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్లకంటే తెలంగాణలో రోడ్లు ఎంతో బాగున్నాయన్నారు.
Roads speak for the difference between Telangana and Andhra Pradesh. If you are on double road it is Telangana, and if it is single road, it’s Andhra - KCR at Sathupalli
— Naveena (@TheNaveena) November 1, 2023
They questioned our capabilities on self-governance but now are coming and selling Paddy here
We are shining… pic.twitter.com/MMXaW9B2wt
ఖమ్మం జిల్లా ప్రజలు ఏపీ, తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో చూడాలి. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ.. సింగిల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్. సరిహద్దుల్లోని ఏపీ ప్రజలు తెలంగాణకు వచ్చి ధాన్యం అమ్మకుంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ గేటు తాకనీయనంటూ ఈ జిల్లాకు చెందిన నేత ఒకరు అహంకారంతో మాట్లాడుతున్నారు. ఆరు నూరైనా మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications