ఆ వాస్తుదోషమే కవితను జైలుపాలు చేసి కేసీఆర్ కొంప ముంచిందా?
తెలంగాణ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన బి ఆర్ ఎస్ పార్టీ ప్రస్తుతం పతనాన్ని చూస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతోపాటు, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ఇరుక్కుని జైలు పాలు కావడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో గత ప్రభుత్వం పాత్ర ఉందని జరుగుతున్న ప్రచారం, కేటీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టార్గెట్ చేయడంతో బి ఆర్ ఎస్ పార్టీ కుదేలవుతోంది.
బీఆర్ఎస్ పరిస్థితికి కారణం కనిపెట్టిన కేసీఆర్
లోక్సభ ఎన్నికల సమయంలో కొనసాగుతున్న వలసలు కూడా మాజీ సీఎం కేసీఆర్ కు నిద్ర పట్టనివ్వడం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు ఏ పార్టీకి రానటువంటి దారుణమైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చింది? ఒకప్పుడు ఎదురే లేకుండా అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్, ఇప్పుడు అష్టకష్టాలను ఎందుకు పడుతుంది? అన్న ప్రశ్నలపై బాగా ఫోకస్ పెట్టిన కెసిఆర్ ఇంత దారుణ పరిస్థితికి కారణం ఏమిటన్నది ఫైనల్ గా కనిపెట్టేశారు.

వాస్తు దోషమే కారణమా?
గులాబీ పార్టీ అధినేత బీఆర్ఎస్ పార్టీకి ఇంత గట్టి దెబ్బ తగలడం వెనుక వాస్తు దోషం ఉందని గుర్తించినట్టు సమాచారం. మొదటి నుంచి యజ్ఞ యాగాలకు, వాస్తుకు ప్రాధాన్యత నిచ్చే కేసీఆర్ తెలంగాణ భవన్ లో ఉన్న వాస్తు దోషం, పార్టీ పతనం కావడానికి కారణంగా గుర్తించారు. దీంతో గులాబీ అధినేత వాస్తు మార్పులు చేయాలని ఆదేశించారు.
తెలంగాణా భవన్ లో వాస్తు మార్పులు
తెలంగాణ భవన్ ఎంట్రీ మరియు ఎగ్జిట్ లోన వాస్తు దోషం ఉన్నట్టుగా గుర్తించిన కెసిఆర్ తక్షణం ఎంట్రీ, ఎగ్జిట్ లను మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్లో వాస్తు మార్పులు చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు తెలంగాణ భవన్లోకి వచ్చేవారు, వెళ్లేవారు వాయువ్య దిశలో ఉన్న గేటును ఉపయోగిస్తున్నారు. అయితే వాయువ్యదిశలో నడవడం వల్లనే ఈ తీవ్ర పరిణామాలు వచ్చాయని వాస్తుపండితులు సూచించడంతో, గేటును ఈశాన్యం దిశకు మార్చాలని నిర్ణయించారు.
వాస్తు మార్పులతో కేసీఆర్ కష్టాలు తీరుతాయా?
ఇకపై ఈశాన్య గేట్ నుంచి మాత్రమే రాకపోకలు సాగించాలని వాస్తు పండితుల సూచనలతో మార్పులు చేర్పులు చేశారు. ఈ క్రమంలోనే ఈశాన్యం నుంచి రాకపోకలు సాగించేలా గేటు తో పాటు కొత్తగా ఒక ర్యాంపును కూడా ఏర్పాటు చేశారు. మరి ఇకనైనా కెసిఆర్ కష్టాలు తీరుతాయా? బీఆర్ఎస్ లో పరిస్థితులు మారుతాయా? అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications