తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు?
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెంచాలంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నారు. ఇప్పటికే ఆయన దీనికి సంబంధించిన అన్ని కసరత్తులు పూర్తిచేశారు. నిపుణులతో కూడా చర్చించారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో అసెంబ్లీ సీట్ల పెంపు ఉందని, ఈమేరకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.

గట్టిగా పట్టుపడుతున్న కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కశ్మీర్‌ను రెండు రాష్ట్రాలుగా చేసిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా పూర్తయింది. పార్లమెంటు ఆమోదముద్ర వేసి ఎన్నికలు జరిపించాల్సి ఉంది. దీంతో తెలంగాణలో కూడా నియోజకవర్గాల సంఖ్య పెంచాలంటూ కేసీఆర్ గట్టి పట్టు పట్టబోతున్నారు. గతంలో చంద్రబాబునాయుడు కూడా ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలంటూ అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని కోరారుకానీ అది ఫలించలేదు. తాజాగా ఇప్పుడు కేసీఆర్ తన ప్రయత్నాలు మొదలుపెట్టారు.

పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది
తెలంగాణలో టీఆర్ ఎస్‌కు, బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేస్తే అధికార పార్టీకే లాభం కలుగుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని కోరుతున్నారని భావిస్తే ఆయనకు లబ్ధి చేకూరే ప్రయత్నం మాత్రం కేంద్రం చేయదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. కానీ ఇంతవరకు సవరణ చేయలేదు.

పెరిగితే మొత్తం స్థానాలు 153
రాష్ట్రంలో మొత్తం 119 శాసనసభ స్థానాలున్న సంగతి తెలిసిందే. పునర్విభజన చట్టం ప్రకారం 34 సీట్లు పెరిగి 153 సీట్లు అవుతాయి. కశ్మీర్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించి, నియోజకవర్గాల సంఖ్యను పెంచి రాజకీయంగా తమకు అనువుగా ఉండేలా బీజేపీ చేసుకుంటోందని టీఆర్ ఎస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. అటువంటిది ఎప్పుడోనే చెప్పిన పునర్విభజన చట్టం ప్రకారం ఇక్కడ ఎందుకు నియోజకవర్గాల సంఖ్య పెంచడంలేదని ప్రశ్నిస్తున్నారు. మీకు బలం ఉన్న చోట ఒకరకంగా బలం లేనిచోట మరోరకంగా భారతీయ జనతాపార్టీ నేతలు పనిచేస్తున్నారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణలో సీట్ల సంఖ్య పెంచాలంటే ఏపీలో కూడా పెంచాల్సి ఉంటుంది. ఒకరకంగా తేనెతుట్టెను కదిలించినట్లవుతుందని భావిస్తున్న కేంద్ర పెద్దలు ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.