సోమవారం బెజవాడలో భేటీ: చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోరిన కెసిఆర్ ఆఫీస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం కలువనున్నారు. ఈమేరకు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని సీఎం కేసీఆర్ కలిసేందుకు సమయం కోరారు.
చంద్రబాబును కలిసి తాను నిర్వహించనున్న ఆయుత చండీయాగానికి హాజరు కావాలని కేసీఆర్ కోరనున్నారు. కెసిఆర్ విజయవాడ పర్యటనను తెలంగాణ అధికారులు ఖరారు కూడా చేశారు. ఎపి రాజధాని విజయవాడలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకుంటారు.

కెసిఆర్ మెదక్ జిల్లా ఎర్రవెల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయుత చండీయాగం తలపెట్టారు. ఈ యాగానికి కెసిఆర్ రాష్ట్రపతితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, వెంకయ్య నాయుడి వంటి కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా ఆయన ఆహ్వానించారు. ఈ యాగానికి చంద్రబాబును స్వయంగా ఆహ్వానించడానికి సోమవారం విజయవాడ వెళ్తున్నారు.
దాంతో మరోసారి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసే సందర్భం వచ్చింది. ఇటీవల ఢిల్లీలో అరుణ్ జైట్లీ కూతురు వివాహ వేడుకలో ఇద్దరు పలకరించకున్నారు. గత దసరా పర్వదినం రోజు జరిగిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఇరువురు ముఖ్యమంత్రులు కలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు స్వయంగా హైదరాబాద్ వచ్చి కెసిఆర్‌ను కలిసి ఆహ్వానించారు.
తన విజయవాడ పర్యటనలో కెసిఆర్ కనకదుర్గ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. అమ్మవారికి తన మొక్కును చెల్లించుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్వప్నం సాకారమైతే విజయవాడ కనకదుర్గమ్మకు రూ.30 నుంచి 45 వేలతో బంగారు ముక్కుపుడక ఇస్తానని మొక్కుకున్నారు.












Click it and Unblock the Notifications