అది మూర్ఖత్వమే: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో కొనసాగుతున్న ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక విధానాలు, ఆయా వర్గా ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా ఎత్తిచూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశారు.
ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు రావాలని, అంశాలవారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు కేసీఆర్. ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని వివరించాలన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం మూర్ఖత్వమని కేసీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

హైడ్రా, లగచర్ల పరిణామాలతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ఠ ఏ విధంగా మసకబారుతోందని.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రజల ఎదురుచూపులు, నిరసన వంటి అంశాలను సభ దృష్టికి తేవడానికి ఏయే చర్యలు తీసుకోవాలి? వంటి అంశాలపై కేసీఆర్ మార్గనిర్దేశం చేస్తున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం.
— BRS Party (@BRSparty) December 8, 2024
ఈ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. pic.twitter.com/XVvmGnknDd
తెలంగాణ తల్లి విగ్రహం అంటే శిల్పం కాదు..
తెలంగాణ తల్లి విగ్రహం అంటే కేవలం శిల్పం కాదు, అది ఉద్యమ చరిత్ర, ఆత్మ గౌరవానికి నిదర్శనం అని అన్నారు బీఆర్ఎస్ నేత శ్రవణ్. విగ్రహ మార్పు ద్వారా ఉద్యమ ఆత్మను దెబ్బతీయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి చర్యను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనేది చరిత్రను అపహాస్యం చేయడమే. రేవంత్ రెడ్డి తీరు శాడిస్టు, సైకోపాత్‌లా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం సింహాల రూపాన్ని మార్చినప్పుడు రాహుల్ గాంధీ స్పందించారు. అదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కూడా కాంగ్రెస్ నేతలు స్పందించాలి. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనేది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడమే కాదు, ఉద్యమ ఆత్మ ప్రతిబింబానికి గాయమిచ్చే ప్రయత్నం. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ చిల్లర నిర్ణయాలను ప్రజలు సహించరని స్పష్టంగా చెప్పాలన్నారు.
తెలంగాణ తల్లి, బతుకమ్మ, ధూమ్ ధామ్ వంటి ప్రతీకలు ఉద్యమ ఆత్మ ప్రతిబింబాలు. వాటి పరిరక్షణకు ప్రతి తెలంగాణ వాసి మద్దతుగా నిలవాలి. చరిత్ర, సంస్కృతి, ఆత్మ గౌరవాన్ని కాపాడడం ప్రభుత్వాధినేతల ప్రధాన బాధ్యత అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications