సీఎం, మంత్రులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులతో భేటీ కావడంపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు.
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు సూచనలు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పదేళ్ల పాలన సాగించామని, బీఆర్ఎస్ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతుందన్నారు. ఓటమితో నిరుత్సాహం, భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుందని కేసీఆర్ అన్నారు.
ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా? ఉండదా? అనేది వాళ్ల చేతుల్లోనే ఉందన్నారు కేసీఆర్. ప్రతిపక్ష పాత్ర సమర్థంగా నిర్వహిద్దామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవాలనుకుంటే పార్టీకి సమాచారం ఇచ్చి కలవాలని కేసీఆర్ సూచించారు. అభివృద్ధి పనుల కోసం కలిస్తే సీఎం, మంత్రులకు ప్రజల మధ్య ఉన్నప్పుడే వినతి పత్రాలు ఇవ్వాలన్నారు. లేదంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో గట్టిగా పోరాడుదామని పిలుపునిచ్చారు. అందరితో చర్చించాకే మంచి అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించాలన్న కేంద్ర ప్రతిపాదనలపై పార్టీ ఎంపీలతో కేసీఆర్ చర్చించారు. ఈ అంశంపై ఉభయ సభల్లో నిరసన తెలపాలన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని ఎంపీలకు కేసీఆర్ నిర్దేశించారు.












Click it and Unblock the Notifications