'మోడీ, కెసిఆర్, బాబు కొత్త పెళ్లి కొడుకుల్లా', 'టిఆర్ఎస్ దేశముదురు'
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావులు... ముగ్గురు కూడా కొత్త పెళ్లి కొడుకుల్లా విహారయాత్రలు చేస్తున్నారని సిపిఐ నేత నారాయణ గురువారం ఎద్దేవా చేశారు.
హైదరాబాదులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్రం విఫలమైందన్నారు.
కుటుంబ పాలన: రేవూరి
తెలంగాణలో ఒకే కుటుంబం పాలన సాగుతోందని తెలంగాణ టిడిపి నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం మండిపడ్డారు. తెలంగాణ రావాలని ప్రజలు కోరుకుంటే ఫలాలను మాత్రం కెసిఆర్ కుటుంబ సభ్యులు అనుభవిస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ బాధ్యతారాహిత్య పాలన వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. కెసిఆర్ కుటుంబ పాలన పైన మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.
టిఆర్ఎస్ పసిగుడ్డు కాదు.. దేశముదురు: ఉత్తమ్
టిఆర్ఎస్ పసిగుడ్డు కాదని, దేశముదురు కేసు అని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. జలహారంలోనే వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారన్నారు. ప్రజలను తాకట్టు పెట్టేందుకే జలహారం ముందుకు తెచ్చారన్నారు.
జలహారం కుంభకోణం పైన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కమీషన్లు తీసుకొని రూ.15వేల కోట్లు ఒకే కంపెనీకి కేటాయించారని ఆరోపించారు. రైతు ఆత్మహత్యల సంఖ్యను తగ్గించి చూపడం సరికాదన్నారు. రుణమాఫీని ఒకేసారి చేయాలన్నారు.












Click it and Unblock the Notifications