వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గులాబీ గూటికి జేజేమ్మ? అదే బాటలో మరికొందరు నేతలు

2014 ఎన్నికల ముందు వరకు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా గద్వాల ఎమ్మెల్యే డీ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2004 - 14 మధ్య రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన సీనియర్లంతా తమ వ్యూహం మార్చుకోనున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. దశాబ్దాలుగా రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరించిన నేతలంతా మూడున్నరేళ్లుగా విపక్ష పాత్రలో ముందుకెలా వెళ్లాలా? అని సంకోచిస్తున్న తరుణమిది. ఈ జాబితాలో గద్వాల జేజెమ్మగా భావించే మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ మంత్రులు దానం నాగేందర్, మోత్కుపల్లి నర్సింహులు తదితర నేతలంతా భవిష్యత్ రాజకీయ మనుగడపై ద్రుష్టి సారించిన నేతలుగా ఉన్నారు.
వారంతా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొంది.. అధికార పార్టీలో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ముందు నిలవడం అంత తేలికేం కాదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో భాగంగా 'కారు' ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారని.. వారికి చోటు కల్పించేందుకు గులాబీ బాస్ సానుకూలంగా ఉన్నారని వార్తలు గుప్పుమన్నాయి.

 2019లో గెలుపుకోసం సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ వ్యూహాలు

2019లో గెలుపుకోసం సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ వ్యూహాలు

తెలంగాణ కల సాకారమైన తర్వాత జరిగిన ఎన్నికల్లో సెంటిమెంట్ ప్రధాన అస్త్రంగా విజయం సాధించి సొంత రాష్ట్రంలో తొలి సర్కార్ ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది. తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పొందడమే తరువాయి ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. ఫక్తు రాజకీయ పార్టీ ముద్ర సంపాదించుకున్నది. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కొండా సురేఖ, నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తదితరులు టీఆర్ఎస్ గూటికి చేరుకుని ఎన్నికల్లో విజయం సాధించారు. టీడీపీలో ఉన్న కడియం శ్రీహరి, బాబుమోహన్ వంటి వారు కారెక్కారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. మరో ఏడాదిలో ఎన్నికల వేడి పుంజుకోనున్నది. ఈ క్రమంలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ప్రత్యామ్నాయ వ్యూహాలు రచిస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయ వ్యూహాల్లో భాగంగా 2014 ప్రారంభం నుంచి నిర్వహించిన ‘ఆపరేషన్ ఆకర్ష్' వ్యూహాన్ని సీఎం చంద్రశేఖర్ రావు అమలు జేయ బూనుకున్నారు.

 టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై అసంత్రుప్తి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై అసంత్రుప్తి

రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇతర పార్టీల నేతలను అక్కున జేర్చుకోనున్నారు. ఈ విషయమై క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు, ఆయా ప్రాంతాల్లోని ప్రముఖుల నుంచి, నిఘా వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ అందుకున్నారని వినికిడి. దీనికి తోడు కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ప్రజల్లో అసంత్రుప్తి పెరిగిందని.. వారు ప్రజల, పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయడం లేదని సీఎం కేసీఆర్‌కు నివేదికలు అందాయి. సరైన చర్యలు తీసుకోకపోతే పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలుపొందడం కష్ట సాధ్యమని ఆ నివేదికల సారాంశం. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఇతర పార్టీల్లో సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలను గులాబీ పార్టీలోకి ఆహ్వానించాలని తలపెట్టారు.

కాంగ్రెస్, టీడీపీ నేతలకు ఇలా సీఎం కేసీఆర్ ఇలా ఆఫర్లు

కాంగ్రెస్, టీడీపీ నేతలకు ఇలా సీఎం కేసీఆర్ ఇలా ఆఫర్లు

ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఈజీగా 50 స్థానాల్లో గెలుపొందుతామని, కొంచెం కష్టపడితే మరో 30 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. ఇంతకుముందు 100 స్థానాలకు తక్కువ కాకుండా గెలుచుకుంటామని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు ఇది విరుద్ధం. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటనతో ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టంగానే ఆయన అంగీకరించినట్లయింది. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, టీడీపీల్లోని కీలక నేతలకు సీఎం కేసీఆర్ ఆఫర్లు ప్రతిపాదించారని వినికిడి. పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని ఆశలు కల్పించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే స్థానాల్లో టిక్కెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని సమాచారం. ప్రత్యేకించి 2004 - 14 మధ్య రాష్ట్ర మంత్రులుగా ఉన్న ముఖేశ్ గౌడ్, దానం నాగేందర్, సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణలకు ‘ఆహ్వానాలు' పంపారని వినికిడి.

 ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా

ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా

గద్వాల - జోగులాంబ జిల్లాలో కీలకమైన మాజీ మంత్రి డీకే అరుణ కుటుంబానికి కంచుకోట. కానీ రాష్ట్ర అధికార రాజకీయాల్లో ఆ కుటుంబం కీలక పాత్ర పోషిస్తున్నది. కానీ 2014 తర్వాత పరిస్థితి తారుమారైంది. సొంత వ్యాపారాలు, లావాదేవీలు జరుపుకోవడం క్లిష్టతరంగా మారింది. దీనికి తోడు గద్వాల - జోగులాంబ జిల్లా ఏర్పాటుతో సీఎం కేసీఆర్ పట్ల సానుకూల ధోరణితో ఉన్నారా? అన్న సందేహాలు ఉన్నాయి. ఇక ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యే. మరో ఏడాదిన్నర తర్వాత మళ్లీ ఎన్నిక కావడం ఎలా అని ద్రుష్టి సారించారు.

 భవిష్యత్ కోసం మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి

భవిష్యత్ కోసం మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి

గోషా మహాల్ నుంచి గత ఎన్నికల్లో ఓటమి పాలైన ముఖేశ్ గౌడ్.. ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై విజయం సాధించడం అంత తేలికేం కాదు. ఇక ఖైరతాబాద్ నుంచి 1999 ఎన్నికల నుంచి కీలక పాత్ర పోషిస్తున్న దానం నాగేందర్.. పీ జనార్దన్ రెడ్డి తర్వాత హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో ప్రస్తుత టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడంతో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో దానం నాగేందర్ టీఆర్ఎస్ గూటికి చేరితే కాంగ్రెస్ పార్టీకి కష్ట కాలమేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నర్సాపూర్ నుంచి 1999, 2004, 2009ల్లో గెలుపొందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా మెరుగైన రాజకీయ భవిష్యత్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

మధిర నుంచి మల్లుపై మోత్కుపల్లి ఇలా ఓటమి

మధిర నుంచి మల్లుపై మోత్కుపల్లి ఇలా ఓటమి

ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత.. 2014కు ముందు సీఎం కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచి విమర్శలు గుప్పించిన మోత్కుపల్లి నర్సింహులుకు గులాబీ పార్టీ నుంచి ఆహ్వానం అందిందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. 2009లో కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటి నుంచి 2014లో తెలంగాణ ఏర్పాటుకు బిల్లు ఆమోదం పొందే వరకు కేసీఆర్‌పై మోత్కుపల్లి విమర్శల దాడి చేశారు. 2014 ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు వలస వెళ్లి మధిర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి, ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క చేతిలో ఓటమి పాలయ్యారు.

 కమ్మటి సామాజిక వర్గంతో బలోపేతం కావాలని ఆశలు

కమ్మటి సామాజిక వర్గంతో బలోపేతం కావాలని ఆశలు

ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మరో సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు. ప్రస్తుత రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో విభేదాలు ఇద్దరూ విడిపోవడానికి కారణమైంది. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, మెదక్ జిల్లాలు మినహా టీఆర్ఎస్ పార్టీకి పెద్దగా సంస్థాగతంగా పట్టులేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో సంస్థాగతంగా పట్టు సాధించాలని సీఎం కేసీఆర్ ద్రుడ సంకల్పంతో ఉన్నారు. అందుకోసం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావును పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే తెలంగాణలో పట్టు ఉన్న రెడ్లతో పెరుగుతున్న దూరాన్ని ‘కమ్మ'టి సామాజిక వర్గంతో కలుపుకుని గెలుపు భావుటా ఎగురవేయాలని టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తున్నది.

 జగదీశ్ రెడ్డికి అండగా టీఆర్ఎస్ నాయకత్వం ఇలా

జగదీశ్ రెడ్డికి అండగా టీఆర్ఎస్ నాయకత్వం ఇలా

ఉమ్మడి నల్లగొండ జిల్లా.. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో బీజేపీ సీనియర్ నేత సంకినేని వెంకటేశ్వర్ రావు 1999 ఎన్నికల నుంచి తుంగతుర్తి నియోజకవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డిని ఎదుర్కోవడంలో వెనుకబడుతున్న సంకినేని వెంకటేశ్వర్ రావుకు సూర్యాపేట నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుంచి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వర్ రావులతో పోటీ పడి విజయం సాధించిన జగదీశ్ రెడ్డి.. టీఆర్ఎస్ అధి నాయకత్వానికి అతి దగ్గరి వారు కావడంతో భవిష్యత్‌లో సమస్యలు తలెత్తకుండా అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అయితే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల్లో ఆహ్వానాలు అందుకున్న నాయకుల్లో చాలా మంది తమకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని గ్యారంటీ ఇస్తే ‘కారె'క్కడానికి సిద్ధమని సంకేతాలిచ్చారని సమాచారం. ఏది ఏమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో విపక్షాల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

English summary
Telangana Rashtra Samithi president and chief minister K Chandrasekhar Rao is likely to revive his strategy of 'Operation Akarsh' in order to strengthen his weakening party base in several districts. According to party sources, KCR has received a feedback from the field level and also from intelligence sources that the people are not happy with the performance of several MLAs and if corrective steps were not taken, the party might lose in their constituencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X