కొండగట్టు అంజన్న సన్నిధిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు; నేటినుండే ఆలయ అభివృద్ధికి అడుగులు!!
కొండగట్టు అంజన్న సన్నిధిలో కేసీఆర్ పూజలు నిర్వహించి ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చెయ్యనున్నారు. ఆలయ అభివృద్ధికి నేటి నుండే అడుగులు పడనున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా కొండగట్టులో పర్యటిస్తున్నారు. కొండగట్టు ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ ఇప్పటికే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి 100 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ తిరుమలగా యాదాద్రి ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని, అలాగే కొండగట్టు అంజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయటం పైన కూడా కేసీఆర్ దృష్టి సారించారు.

కొండగట్టు చేరుకున్న కేసీఆర్.. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
కొండగట్టు పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి బేగంపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో జగిత్యాల లోని కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకి చేరుకుని, అక్కడి నుండి రోడ్డు మార్గంలో కొండగట్టుకు చేరుకున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి మరియు విస్తరణ ప్రతిపాదనలను స్వయంగా పరిశీలించనున్న సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయానికి చేరుకోగా, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికారు.

కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఆపై షెడ్యూల్ ఇలా
కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఆపై షెడ్యూల్ ఇలా
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలలో పాల్గొంటున్నారు. నిర్వహణ అనంతరం ఆలయ అభివృద్ధి పునర్నిర్మాణం పనులు చేపట్టే పరిసరాలను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఆలయ పునర్నిర్మాణం విషయంలో, అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్ పలు సూచనలు చేయనున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు చేర్పులపై ఆయన అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశంలో మాట్లాడతారు. భక్తుల సౌకర్యం కోసం చేపట్టవలసిన అభివృద్ధి పనులపై కూడా నేడు కెసిఆర్ ఒక నిర్ణయానికి రానున్నారు.
యాదాద్రి ఆర్కిటెక్ట్ కే కొండగట్టు అంజన్న ఆలయం బాధ్యత
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే కెసిఆర్ ఆదేశాల మేరకు ఆర్కిటెక్చర్ ఆనంద సాయి కొండగట్టుకు వెళ్లి అక్కడి పరిసరాలను, అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణం, భారీ ప్రకారాలు, రోడ్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్లాన్ ను సిద్ధం చేశారు. యాదాద్రి తరహాలో కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని పునర్ నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం యాదాద్రి ఆర్కిటెక్ట్ గా పని చేసిన ఆనంద్ సాయికే కొండగట్టు మాస్టర్ ప్లాన్ తయారీ, పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది.
దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష
ఇక నేడు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ కొండగట్టు అంజన్న పూజల అనంతరం కోనేరు పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మ వారి కన్నీటిధార, బేతాళ స్వామి ఆలయంతో పాటు అక్కడి పలు ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఆలయ అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications